తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ కోసం బీజేపీ స్పీడ్ పెంచింది. ఇందులో భాగంలో ఆగస్టు 18న హైదరాబాద్లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు బీజేపీ తెలంగాణ విభాగం తెలిపింది.
ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా హజరుకానున్నారు. వీరి సమక్షంలో ఇతర పార్టీల నుంచి నాయకులు చేరనున్నట్లు సమాచారం. గతంలోనే బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యుడు గరికపాటి రామ్మోహన్ రావు కూడా బహిరంగ సభలో అధికారికంగా మరోసారి పార్టీ కండువా కప్పుకోనున్నారట.
ఆయనతో పాటు ఇతర పార్టీలకు చెందిన సుమారు 20 మంది రాష్ట్ర నాయకులు కూడా కమలం గూటికి చేరనున్నారు. తెలంగాణలో టీడీపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతున్న సందర్భంలో ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరడానికి సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది.
టీడీపీ జిల్లా అధ్యక్షులు, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు కాషాయ కండువా కప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్, నల్గొండ, ఖమ్మం, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన చాలా మంది నాయకులు బహిరంగ సభ నేపథ్యంలో పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో త్వరలో నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ పుంజుకోవడానికి ఈ బహిరంగ సభ దోహదపడనుంది.