Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తమిళనాట సినీ తారలు రాజకీయాల్లో చక్రం తిప్పిన సందర్బాలు చాలానే ఉన్నాయి. మొన్నటి వరకు సీఎంగా చేసిన జయలలిత, అంతకు ముందు ఎంజీఆర్, కరుణానిధి వంటి వారు కూడా సినీ పరిశ్రమకు చెందిన వారే. అందుకే తమిళ సినీ తారలు ఎక్కువగా రాజకీయాలపై ఆసక్తిని పెంచుకుంటూ ఉంటారు. తాజాగా రజినీకాంత్ పార్టీ పెట్టబోతుండటంతో పాటు, కమల్ హాసన్ కూడా రాజకీయాల గురించి మాట్లాడటం వంటివి చూస్తే రాబోయే ఎన్నికల్లో తమిళనాట సినీ తారల సందడి మళ్లీ విపరీతంగా ఉండబోతుంది.
తమిళనాట ఎలాగైనా పాగా వేయాలని బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అందుకోసం రజినీకాంత్‌ను పార్టీలోకి ఆహ్వానించే ప్రయత్నం చేసింది. కాని రజినీకాంత్ మాత్రం సొంతంగా పార్టీ పెట్టాలనే నిర్ణయానికి వచ్చాడు. దాంతో పార్టీని బలోపేతం చేసేందుకు బీజేపీ నాయకత్వం స్టార్ హీరోయిన్ త్రిషను సంప్రదిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల త్రిషతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఫోన్‌లో మాట్లాడటం జరిగిందని, బీజేపీలో జాయిన్ అయ్యి, వచ్చే ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం చేయాల్సిందిగా త్రిషను ఆయన కోరినట్లుగా తమిళనాట ప్రచారం జరుగుతుంది. ఈ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది.