Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సార్వత్రిక ఎన్నికల సెమీఫైనల్స్ లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారయ్యాయి. కర్నాటకం కాషాయదళం సొంతమయింది. కాంగ్రెస్ ముక్త భారత్ దిశగా… కీలక అడుగు పడింది. నాలుగేళ్ల క్రితం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన దగ్గరనుంచి దాదాపు వరుసగా అన్ని రాష్ట్రాల్లో విజయఢంకా మోగిస్తూ వస్తున్నబీజేపీ దక్షిణాదిలోనూ సత్తా చాటింది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ కర్నాటకలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. మోడీ-షా వ్యూహాల ముందు సిద్ధరామయ్య తలొంచకతప్పలేదు. ఇక కింగ్ మేకరో, కింగో అవుదామనుకున్న కుమారస్వామి ఆశలూ ఫలించలేదు. మొత్తంగా… ఈ ఎన్నికలు దేశంలో మోడీ-షాలకు ఇప్పట్లో ఎదురులేదని మరోసారి నిరూపించాయి.
నిజానికి తొలుత ఎన్నికల ఫలితాలు వెల్లడవ్వడం మొదలుకాగానే హంగ్ సూచనలు కనిపించాయి. ప్రభుత్వ ఏర్పాటులో జేడీఎస్ మద్దతు కీలకమన్న భావన నెలకొంది. దీంతో ఆ పార్టీ మద్దతు కోసం అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ రంగంలోకి దిగాయి. గోవా,మణిపూర్ అనుభవాలు దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ నేతలు గులాంనబీ ఆజాద్, అశోక్ గెహ్లాట్ హుటాహుటిన బెంగళూరు చేరుకున్నారు. అటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో సమావేశమైన అనంతరం ప్రకాశ్ జవదేకర్ కూడా జేడీఎస్ తో మంతనాలకు ప్రయత్నాలు ప్రారంభించారని వార్తలొచ్చాయి. కానీ జేడీఎస్ ఆశలపై నీళ్లు చల్లుతూ… కాషాయ శిబిరంలో అమితోత్సాహం నింపుతూ కాసేపటికే ఫలితాల సరళిలో మార్పు వచ్చింది. బీజేపీ స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకుపోయింది.
ఈ ఫలితాలు కాంగ్రెస్ కే కాదు… ఎగ్జిట్ పోల్స్ కూ ఎదురుదెబ్బే. కర్నాటకలో బీజేపీ స్పష్టమైన గెలుపు సాధిస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. పెద్ద నోట్లరద్దు, జీఎస్టీ తో పాటు… మరికొన్ని నిర్ణయాలతో మోడీపైనా, బీజేపీపైనా దేశప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, కర్నాటక ఎన్నికల్లో ఆ వ్యతిరేకత బీజేపీ ఓట్లకు భారీగా గండికొడుతుందని భావించిన వారు ఫలితాల సరళి చూసి ఆశ్చర్యానికి లోనవుతున్నారు. అటు ఫలితాల ముందు దాకా జేడీఎస్ తో పొత్తుకు తహతహలాడిన బీజేపీ… ఇప్పుడు మాత్రం ఆ ఊసే ఎత్తడంలేదు. ప్రభుత్వం ఏర్పాటుచేయడానికి తమకు ఎవరి మద్దతు అవసరం లేదని బీజేపీ సీనియర్ నేత సదానంద గౌడ తెలిపారు. బీజేపీ మ్యాజిక్ ఫిగర్ దాటేసిందని, ఇక కూటములతో పనిలేదని ఆయన వ్యాఖ్యానించారు.