Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రాజకీయాల్లోకి వస్తున్నానని అధికారికంగా ప్రకటించిన దగ్గరనుంచి విశ్వనటుడు కమల్ హాసన్ కేంద్రప్రభుత్వాన్ని, ప్రధాని నరేంద్రమోడీని టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్నారు. తన రంగు కాషాయం కాదని ముందే ప్రకటించినట్టుగా… కాషాయదళానికి వ్యతిరేకంగా అవకాశం చిక్కినప్పుడల్లా గళమెత్తుతున్నారు. తొలుత పెద్ద నోట్ల రద్దుపై కమల్ స్పందించారు. గతంలో నోట్ల రద్దు వల్ల జరిగే నష్టాలు తెలియక తాను కేంద్రప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించానని, అందుకు దేశ ప్రజలు, అభిమానులు తనను క్షమించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ కీలక నిర్ణయాన్ని తప్పుబట్టడం ద్వారా కమల్ తాను కొత్తగా పెట్టబోయే పార్టీ… బీజేపీకి వ్యతిరేకమే అని స్పష్టంచేశారు. తరువాత మెర్సెల్ సినిమా వివాదంలోనూ కమల్ బీజేపీ వైఖరిపై విమర్శలు గుప్పించారు. వివాదాస్పద జీఎస్ టీ డైలాగ్ ను సినిమా నుంచి తొలగించాలని బీజేపీ చేస్తున్న డిమాండ్ ను కమల్ వ్యతిరేకించారు. విమర్శలను ఆపేందుకు ప్రయత్నించకూడదని, వాటికి సమాధానం చెప్పాలని పరోక్ష సలహా ఇచ్చారు.
ప్రజలు తమ దేశభక్తిని నిరూపించుకోడానికి సినిమా హాళ్లల్లో జాతీయ గీతం ప్రసారంచేసేటప్పుడు లేచి నిల్చోవాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు వ్యక్తంచేసిన అభిప్రాయాన్ని కమల్ సమర్థించారు. కావాలంటే కేంద్రప్రభుత్వం సింగపూర్ లా దూరదర్శన్ లో జనగణమన ప్రసారం చేయాలని, అంతేకానీ ఎక్కడపడితే అక్కడ దేశభక్తిని రుజువు చేసుకోవాలని బలవంత పెట్టకండి అని ట్వీట్ చేశారు. తాజాగా ఓ పత్రికకు రాసిన వ్యాసంలో బీజేపీని, ఆరెస్సెస్ ను టార్గెట్ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశంలో హిందూ ఉగ్రవాదం పెరిగిపోయిందని, దీన్ని అడ్డుకోవడంలో ఉత్తర భారతదేశంలో బీజేపీ ఘోరంగా విఫలమయిందని విమర్శించారు. గుజరాత్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉందన్నారు. ఈ మూడూ బీజేపీ పాలిత రాష్ట్రాలు కావడం గమనార్హం. దక్షిణాదిన హిందూ ఉగ్రవాదాన్ని అడ్డుకోవడంలో కేరళ ప్రభుత్వ పనితీరు భేషుగ్గా ఉందని, తమిళనాడు మాత్రం విఫలమయిందని కమల్ విమర్శించారు.
హిందూ సంస్థలు గతంలో హింసకు పాల్పడేవి కాదని, మాటలతోనే ప్రత్యర్థులను ఎదుర్కొనేవని, ఇప్పుడు మాత్రం భౌతిక దాడులకు తెగబడుతున్నాయని, హిందూ ఉగ్రవాదులును కొందరు వెనకనుంచి ప్రోత్సహిస్తున్నారని కమల్ తన కథనంలో ఆరోపించారు. ఈ మేరకు వికటన్ పత్రికకు కమల్ రాసిన వ్యాసం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. కమల్ వ్యాసంపై బీజేపీ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేసింది. హిందూ ఉగ్రవాదం అన్న పదం వాడినందుకు కమల్ హాసన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. కమల్ మానసిక ఆరోగ్యం బాగాలేదని, వెంటనే ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించాలని బీజేపీ సీనియర్ నేత వినయ్ కతియార్ మండిపడ్డారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే కమల్ విమర్శలు చేస్తున్నారని, రాజకీయాలు ఇంతగా దిగజారడం మంచిదికాదని అన్నారు. కమల్ పై పరువునష్టం దావా వేసే విషయాన్ని కూడా తమిళనాడు బీజేపీ పరిశీలిస్తోందని చెప్పారు. ఇప్పుడే కాదు..రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించకముందు నుంచీ..కమల్ ది హిందూ వ్యతిరేక భావజాలమే. స్వతహాగా నాస్తికుడయిన కమల్ దైవపూజకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తుంటారు. రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించిన తరువాత ఆయన పదజాలం మరింత తీవ్రంగా మారింది.