Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కర్నాటకంలో ఎలాగైనా గెలవాలని భావిస్తున్న బీజేపీ… ఏ ఒక్క అవకాశాన్నీ విడిచిపెట్టడంలేదు. సాధారణంగా రాజకీయ పార్టీలు ఎన్నికలవేళ సెలబ్రిటీలను తమ పార్టీలోకి ఆహ్వానించడం, వారిని ప్రచార బరిలోకి దించడం ద్వారా ఓట్లు పెంచుకునేందుకు ప్రయత్నిస్తాయి. సార్వత్రిక ఎన్నికలతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇలాంటి వ్యూహాలు కనిపిస్తుంటాయి. సినీ తారలు, క్రికెటర్లు, ఇతర రంగాల్లో ప్రఖ్యాతులైనవారిని తమ పార్టీల్లోకి తీసుకునేందుకు అన్ని పక్షాలూ పోటీపడుతుంటాయి. ముఖ్యంగా క్లీన్ ఇమేజ్ ఉన్నవారు పార్టీలో చేరి, ప్రచారం నిర్వహిస్తే… ఎన్నికలసమయంలో లాభిస్తుందన్నది రాజకీయనేతల అభిప్రాయం. ఇప్పుడు కర్నాటకంలో బీజేపీ కూడా ఈ వ్యూహమే రచిస్తోంది.
గెలుపుకోసం సర్వశక్తులూ ఒడ్డుతున్న బీజేపీ… సెలబ్రిటీలపై కన్నేసింది. సెలబ్రిటీలుకూడా… అలాంటిలాంటి సెలబ్రిటీలు కాదు… క్రికెట్ దిగ్గజాలు… తమ మొత్తం కెరీర్ లో చిన్నమచ్చైనా లేకుండా మిష్టర్ క్లీన్ ఇమేజ్ ఉన్న మాజీ క్రికెటర్లు అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రావిడ్ ను పార్టీలోకి రప్పించేందుకు బీజేపీ ప్రయత్నాలు ప్రారంభించింది. ద్రవిడ్, కుంబ్లేలు ప్రచారం నిర్వహిస్తే… మే 12న జరగనున్న ఎన్నికల్లో బీజేపీకి లాభం చేకూరుతుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. వారిని తమ పార్టీలో చేర్చుకుని ఎన్నికల బరిలోకి దించాలని కూడా వ్యూహం రచిస్తున్నారు. అయితే బీజేపీ ఆహ్వానాన్ని క్రికెట్ దిగ్గజాలిద్దరూ తిరస్కరించినట్టు తెలుస్తోంది. స్థానిక బీజేపీ నేతలు వారిని కలిసి చర్చించినప్పుడు కుంబ్లే, ద్రవిడ్ విముఖత వ్యక్తంచేశారని, అయితే వారిని ఎలాగైనా ఒప్పించాలని బీజేపీ విశ్వప్రయత్నాలూ చేస్తోందని కర్నాటక సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
ఇద్దరిలో ఒకరిని రాష్ట్ర అసెంబ్లీ బరిలో దింపి, మరొకరిని జాతీయ రాజకీయాల్లోకి పంపుతామని కూడా ఆఫర్ ఇచ్చిందని, అయినా సరే బీజేపీ ఆహ్వానాన్ని వారు తిరస్కరించారని సమాచారం. మాజీ క్రికెటర్లిద్దరూ రాజకీయాల్లోకి రావడానికి నిరాకరించినప్పటికీ… బీజేపీ తమ ప్రయత్నాలకు ఫుల్ స్టాప్ పెట్టడంలేదు. కుంబ్లే, ద్రవిడ్ తో ఇంకా చర్చలు కొనసాగుతున్నాయని, కనీసం వారిలో ఒకరినైనా లోక్ సభ లేదా రాజ్యసభ బరిలో దింపుతామని, ఇంకా మాకు ఆశలు ఉన్నాయని బీజేపీ నేతలు చెబుతున్నారు. అటు ఈ విషయంపై మీడియా వద్ద స్పందించేందుకు కుంబ్లే, ద్రవిడ్ నిరాకరించారు. మొత్తానికి బీజేపీ ప్రయత్నాలు గనక ఫలించి… దిగ్గజాలిద్దరూ కమలం పార్టీ తీర్థం గనక పుచ్చుకుంటే… ఎన్నికల్లో ఆ పార్టీకి ఎంతో ప్రయోజనంగా కలుగుతుందని మాత్రం కచ్చితంగా చెప్పవచ్చు.