Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సుబ్రహ్మణ్యస్వామి..తమిళనాడుకు చెందిన ఆయన జాతీయ స్థాయి రాజకీయాల్లో ఓ సంచనలం. స్వపక్షంలో విపక్షపాత్ర పోషించే నేత. అదే సమయంలో కాకలు తీరిన నేతలను సైతం కేసుల కోసం కోర్టులు, జైళ్ల చుట్టూ తిరిగేలా చేయగలరు. అక్రమాస్తుల కేసులో తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జైలు జీవితం గడపడానికి, ఇప్పుడు శశికళ జైల్లో ఉండడానికీ ఆయన వేసిన కేసులే కారణం. నేషనల్ హెరాల్డ్ పత్రిక కేసులో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీలను కూడా కోర్టుల చుట్టూ తిరిగేలా చేశారు. అలాగే ఆయన వ్యవహారశైలీ మిగిలిన నేతల తీరుకు భిన్నంగా ఉంటుంది. బీజేపీ ఎంపీ కాబట్టి ఆ పార్టీకి అనుకూలంగా మాట్లాడాలన్న నియమనిబంధనలేమీ ఆయన పెట్టుకోరు. తనకు ఏది కరెక్ట్ అనిపిస్తే అదే మాట్లాడతారు. తనకు తప్పనిపించిన విషయంపై సొంత పార్టీనైనా ఎదిరించి నిలబడతారు. పార్టీలోభిన్నాభిప్రాయం వినిపిస్తారు. ఉదాహరణకు తమిళనాడులో శశికళ ముఖ్యమంత్రి పీఠం అధిరోహించేందుకు రంగం సిద్ధంచేసుకుంటున్న వేళ..కేంద్రంలోని మోడీ ప్రభుత్వం..తెర వెనక పావులు కదిపి…
ఆమెకు పదవి దక్కకుండా చేసింది. ఆ సమయంలో నిజానికి మోడీకి దేశవ్యాప్తంగా అందరూ మద్దతిచ్చారు. జయలలిత, శశికళ స్నేహబంధంపైనా, జయలలిత మరణంపైనా ఉన్న అనుమానాల నేపథ్యంలో…శశికళ అప్పటికప్పుడు ముఖ్యమంత్రి కావాలనుకోవడం…తమిళనాడు ప్రజలకే కాక..ఎవరికీ నచ్చలేదు. అందుకే అప్పట్లో కేంద్రం ప్రవర్తనపై ఎవరూ వ్యతిరేకత కనబరచలేదు. కానీ విచిత్రంగా సుబ్రహ్మణ్యస్వామి మాత్రం బీజేపీపై విరుచుకుపడ్డారు. తాను ఒకప్పుడు అక్రమాస్తుల కేసు పెట్టిన శశికళకే మద్దతు పలికారు. తమిళనాడు గవర్నర్ తక్షణమే శశికళతో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయించాలని డిమాండ్ చేశారు. ఇదే కాదు..ఇలాంటి ఉదాహరణలు చాలానే ఉన్నాయి. మొన్నటికి మొన్న పార్లమెంట్ సమావేశాలు ఎలాంటి చర్చా లేకుండా నిరర్ధకంగా ముగిశాయన్న కారణంతో ఎన్డీఏ ఎంపీలెవరూ వేతనాలు తీసుకోవద్దని ప్రధాని మోడీ కోరగా..అందరూ అందుకు సమ్మతించారు. సుబ్రహ్మణ్య స్వామి మాత్రం తాను లోక్ సభకు వచ్చానని, చర్చ జరగడం, జరగకపోవడం అనేది తనకు సంబంధం లేని విషయమని…సభకు హాజరయ్యాను కాబట్టి…తన జీతం తాను తీసుకుంటానని తేల్చిచెప్పారు.
ఈ వ్యాఖ్యలు చూసి బీజేపీకి ఆయన వ్యతిరేకం అనుకుంటే పొరపడ్డట్టే..ఆయన వ్యతిరేకించాల్సినవి వ్యతిరేకిస్తారు..సమర్థించాల్సినవి సమర్థిస్తారు అనడానికి అమెరికాలో చేసిన ఓ ప్రసంగమే ఉదాహరణ. న్యూయార్క్ లోని కొలంబియా బిజినెస్ స్కూల్ లో 14వ ఇండియన్ బిజినెస్ కాన్ఫరెన్స్ లో సుదీర్ఘంగా ప్రసంగించిన సుబ్రహ్మణ్యస్వామి..బీజేపీ ప్రభుత్వానికి సంబంధించిన అనేక విషయాలపై మాట్లాడారు. 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ మెజార్టీ సాధించి మళ్లీ అధికారంలోకి వస్తుందని ఆయన తేల్చిచెప్పారు. బీజేపీ విజయానికి గల మూడు కారణాలను కూడా ఆయన వెల్లడించారు. ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వం, అవినీతికి వ్యతిరేకంగా తాము చేస్తున్న పోరాటం, హిందూ ఓటర్లను ఏ పార్టీకి ఓటు వేస్తే వారి హక్కులు సురక్షితంగా ఉంటాయో చెబుతూ వారిని ఒప్పించడం విజయానికి ముఖ్య కారణాలుగా విశ్లేషించారు. అంతేకాదు..విద్యార్థులు, విద్యావేత్తలు, వ్యాపారవేత్తలు హాజరైన ఈ సదస్సులో నాలుగేళ్ల బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను కూడా స్వామి నిర్మొహమాటంగా ఎండగట్టారు. మోడీ ప్రతిష్టాత్మకంగా భావించి అమలు చేసిన పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ నిర్ణయాలను స్వామి విఫలప్రయోగంగా అభివర్ణించారు. జీఎస్టీ అమలు ఓ పీడకల లాంటిదని, దాని అమలు విషయంలో విఫలమయ్యామని, దీన్ని అంగీకరించాల్సిందేనని ఆయన కుండ బద్ధలు కొట్టారు.
వ్యాపార వర్గాల్లో ఇదొక ట్యాక్స్ టెర్రరిజం అనే అభిప్రాయం బలంగా ఉందని, దీన్ని సరిదిద్దాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. ఆర్థిక రంగం పనితీరువిషయంలో బీజేపీ ప్రభుత్వం ఇంకా చాలా దూరం పయనించాల్సి ఉందని వ్యాఖ్యానించారు. అయితే 2019లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరిన్ని సంస్కరణలు తీసుకువస్తుందని, వాటి కారణంగా భారత్ మరో పదేళ్లు ఏడాదికి 10శాతం చొప్పున వృద్ధి సాధించి ప్రపంచంలో బలీయమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతుందని జోస్యంచెప్పారు. మొత్తానికి ఆర్థికరంగం వైఫల్యాలను పక్కనపెడితే…వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలిచితీరుతుందన్నది సుబ్రహ్మణ్యస్వామి విశ్లేషణ. దేశమంతా మోడీ వ్యతిరేక గాలి వీస్తున్న ప్రస్తుత తరుణంలో స్వామి మాత్రం ఆయనపై విశ్వాసం ఉంచడం పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశం. ఎందుకంటే.. రాజకీయాలకు సంబంధించి సుబ్రహ్మణ్యస్వామి చేసే విశ్లేషణ చాలా కచ్చితంగా ఉంటుంది. ఏ పార్టీ గెలవబోతోంది…ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు..వంటివాటిపై ఆయన అంచనాలు నూటికి నూరుపాళ్లూ నిజమయిన సందర్బాలున్నాయి.