Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
బీజేపీకి వ్యతిరేకంగా తీవ్ర విమర్శలు చేస్తోన్న విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి ట్విట్టర్ లో ఆ పార్టీ నేతలపై విరుచుకుపడ్డారు. తాను ప్రసంగించిన ఓ వేదికను భారతీయ జనతా యువమోర్చా సభ్యులు గోమూత్రంతో శుద్ధిచేశారని ప్రకాశ్ రాజ్ ఆరోపించారు. తాను ప్రసంగించిన అన్నిచోట్లా ఇలానే శుద్ధిచేస్తారా అని ప్రశ్నించారు. తన వ్యాఖ్యలకు మద్దతుగా ఓ పేపర్ క్లిప్ ను కూడా పోస్ట్ చేశారు. గతవారం కర్నాటకలోని సిర్సిలో మన రాజ్యాంగం, మన గౌరవం అనే కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమంలో ప్రసంగించిన ప్రకాశ్ రాజ్ ఉత్తర కన్నడ ఎంపీ, కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డేను విమర్శించారు. ఈ విమర్శలకు కౌంటర్ గా సంక్రాంతి రోజు బీజేపీ యువనేతలు వేదికను గోమూత్రంతో శుద్ధిచేశారు. కొద్దికాలంగా కేంద్ర ప్రభుత్వంపైనా, బీజేపీ నేతలపైనా..ప్రకాశ్ రాజ్ తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. జర్నలిస్ట్ గౌరీలంకేశ్ హత్యవిషయంలో తొలిసారి ప్రధాని మోడీని విమర్శించిన ప్రకాశ్ రాజ్ అప్పటినుంచి జస్ట్ ఆస్కింగ్ పేరుతో ట్విట్టర్ లో బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలు, వైఖరి చూసినవాళ్లు త్వరలోనే ఆయన రాజకీయాల్లోకి వచ్చే అవకాశముందని విశ్లేషిస్తున్నారు. బీజేపీ వ్యతిరేక కూటమితో ప్రకాశ్ రాజ్ కలిసి పనిచేయనున్నారన్న వార్తలు కూడా వస్తున్నాయి. అయితే రాజకీయ ప్రవేశం గురించి ప్రకాశ్ రాజ్ ఎప్పుడూ మాట్లాడలేదు. సమాజంలో బాధ్యత గల ఓ పౌరుడిగా తాను ఈ విమర్శలు చేస్తున్నానని ఆయన చెబుతున్నారు.