Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
జాతీయ, అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్ కు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ముఖ్య అతిథిగా హాజరవుతుంటారు. ఫెస్టివల్స్ లో పాల్గొనే ఇతర ప్రముఖులు, కార్యక్రమ యాంకర్ లు కేంద్రమంత్రితో ఎంతో గౌరవంగా వ్యవహరిస్తారు. మంత్రిపై జోకులు వెయ్యడం గానీ, ప్రత్యక్షంగా, పరోక్షంగా విమర్శించడం కానీ ఎవరూ చేయరు. కానీ గోవాలో జరుగుతున్న 48వ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా కార్యక్రమంలో ఇందుకు భిన్నంగా జరిగింది. కార్యక్రమ యాంకర్ కేంద్రమంత్రిని కామెంట్ చేయడం, దానికి మంత్రి… దీటుగా బదులివ్వడం హాట్ టాపిక్ గా మారింది.
కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రి అయిన స్మృతి ఇరానీ ఫిలిం ఫెస్టివల్ కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ రావ్ యాంకర్ గా వ్యవహరించారు. ఫెస్టివల్ లో భాగంగా ప్రముఖ ఇరానీ దర్శకుడు మజీద్ మజిదీ రూపొందించిన బియాండ్ ది క్లౌడ్స్ సినిమా ప్రదర్శించారు. దీని గురించి వ్యాఖ్యానిస్తూ రాజ్ కుమార్ కేంద్రమంత్రి స్మృతి ఇరానీ లానే ఆ దర్శకుడు మజిద్ కూడా ఇరానీనే అని చమత్కరించాడు. దీనికి స్మృతి కోపం తెచ్చుకోకుండా నవ్వుతూనే చురకలంటించారు. ఓ కేంద్ర మంత్రిపై హీరో రాజ్ కుమార్ కామెంట్ చేశాడని, ప్రభుత్వం ఎంత సహనంతో వ్యవహరిస్తోందో దీన్ని బట్టే అర్ధమవుతోందని మంత్రి వ్యాఖ్యానించారు. ఈ కామెంటు వల్ల ఆయన కాలు విరగ్గొట్టింది బీజేపీ కార్యకర్తలే అని ఎవరూ తమపై నిందలు వేయకుండా ఉంటారని, ధన్యవాదాలని దీటుగా బదులిచ్చారు. ఓ సినిమా చిత్రీకరణ సమయంలో రాజ్ కుమార్ కాలికి తీవ్ర గాయమైంది. దీంతో కర్రసాయంతో కార్యక్రమానికి హాజరయ్యాడు రాజ్ కుమార్. దాన్ని ప్రస్తావిస్తూనే స్మృతి ఈ వ్యాఖ్యలుచేశారు.