Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పద్మావతిపై చెలరేగిన వివాదాన్ని బాంబే హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. దేశవ్యాప్తంగా సినిమాకు వ్యతిరేకంగా ఆందోళనలు, పద్మావతిపై కొన్ని రాష్ట్రాల సీఎంలు నిషేధం విధించిన నేపథ్యంలో బాంబే హైకోర్టు స్పందించింది. దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ, హీరోయిన్ దీపికా పదుకునేలను చంపివేస్తామంటూ బెదిరింపులు రావడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. వేరే ఏ దేశంలోనూ కళాకారులను ఇలా చంపేస్తామంటూ బెదిరించరని హైకోర్టు న్యాయమూర్తులు ధర్మాధికారి, భారతీ డాంగ్రేలు వ్యాఖ్యానించారు. ఎంతో మంది కష్టపడి తీసిన సినిమా బెదిరింపుల కారణంగా విడుదల కాకపోవడం అత్యంత బాధాకరమని న్యాయమూర్తులు ఆవేదన వ్యక్తంచేశారు. దేశంలో ఓ ఫీచర్ చిత్రాన్ని విడుదల కానివ్వడం లేదని, అసలు మనం ఏ స్థితికి చేరుకున్నామని వారు ప్రశ్నించారు.
కళాకారుల తల నరికి ఇస్తే రివార్డులు ఇస్తామంటున్నారని, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా వారితో సమానంగా ఆందోళనలు చేస్తూ సినిమా నిషేధించారని, ఇవి సరైన చర్యలు కాదని న్యాయమూర్తులు ఆగ్రహం వ్యక్తంచేశారు. పేరు, డబ్బున్న వారికే ఇలాంటి సమస్యలు ఎదురయినప్పుడు ఇక పేదల పరిస్థితి ఏమిటని వారు ప్రశ్నించారు. అటు పద్మావతికి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా అనేక చోట్ల మద్దతు దొరికినప్పటికీ బీజేపీ పాలిత రాష్ట్రాలు మాత్రం సినిమాపై వ్యతిరేక వైఖరే ప్రదర్శిస్తున్నాయి. ఇప్పటికే రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలు నిషేధం విధించగా… తాజాగా గోవాలోని మనోహర్ పారికర్ ప్రభుత్వం కూడా పద్మావతిపై అదే వైఖరి అవలంబించనున్నట్టు తెలుస్తోంది.
సినిమాపై నిషేధం విధించాలన్న డిమాండ్ ను పరిశీలిస్తామని గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ప్రకటించారు. పర్యాటకమే ప్రధాన ఆదాయ వనరుగా సాగుతున్న గోవా శాంతి, భద్రతల సమస్యలను భరించే స్థితిలో లేదని పారికర్ వ్యాఖ్యానించారు. పద్మావతిని గోవాలో ప్రదర్శించకుండా నిషేధం విధించాలన్న బీజేపీ మహిళా మోర్చా డిమాండ్ ను పరిశీలిస్తామన్నారు. సినిమాకు సెన్సార్ అనుమతి వచ్చిన తర్వాత దీనిపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అవసరమైతే వివాదాస్పద అంశాలు తొలగిస్తామన్నారు. చరిత్రను సరైన రీతిలో చూపించాలని, తప్పుడు మార్గంలో దాన్ని చిత్రీకరిస్తే ప్రజల మనోభావాలు గాయపడతాయన్నది తన వ్యక్తిగత అభిప్రాయమని పారికర్ వ్యాఖ్యానించారు.