యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం హాజీపూర్‌లో ఉద్రిక్తపరిస్థితులు నెలకున్నాయి. శ్రావణి హత్యకేసులో ప్రధాన నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి ఇంటిని గ్రామస్థులు చుట్టిముట్టి, దాడి చేసి నిప్పంటించారు. పోలీసుల భద్రత ఉన్నా లెక్కచేయకుండా నిప్పటించడంతో ఇంటిముందున్న పందిరి కాలిపోయింది. ఈ పరిణామాాలతో ఉద్రిక్తలు తారాస్థాయికి చేరుకోగా, పోలీసులు అప్రమత్తమయ్యారు. తమ కళ్ల ముందు తిరుగుతూ మానవ మృగం చేతిలో తీవ్రంగా హింసించబడి, దారుణ హత్యకు గురైన అమ్మాయిలను తలచుకుని బాధపడుతున్న హజీపూర్ గ్రామస్థుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. గ్రామంలో వెలుగుచూసిన హత్యలు తీవ్ర కలకలం రేపగా, గతంలో అమ్మాయిల అదృశ్యంపై ఫిర్యాదులు చేసినా పోలీసులు పట్టించుకోలేదని, అందువల్లే దారుణాలు జరిగాయని ఆరోపిస్తూ నిరసనలకు దిగారు. నిందితుడు శ్రీనివాస్ రెడ్డి ఇంటిని నాశనం చేసి, తగులబెట్టి, దీనిని చిత్రీకరించడానికి వెళ్లిన మీడియానూ కూడా వదల్లేదు. కవరేజ్‌కి వెళ్లిన మీడియా ప్రతినిధులు, కెమెరామెన్లపై ప్రజలు దాడికి దిగారు. తమ గ్రామానికి రావద్దంటూ వారితో వాగ్వాదానికి దిగి, కెమెరాలను ధ్వంసం చేశారు. ఆ సమయంలో రాచకొండ పోలీసులు అక్కడే ఉన్నా, వారిని అడ్డుకునే ప్రయత్నం చేయలేదని మీడియా ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. తమ గ్రామంలోకి మీడియాను అనుమతించేది లేదని ప్రజలు స్పష్టం చేయడంతో చేసేదేమీ లేక వెనుదిరగాల్సి వచ్చింది.