Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఆదివారం ఉదయం నుంచి టీవీచానళ్లు, పత్రికలు, సోషల్ మీడియాలో వెల్లువెత్తిన శ్రీదేవి వార్తలకు తెరపడింది. అతిలోకసుందరికి ఘనంగా అంతిమనివాళి సమర్పించిన తర్వాత మీడియా మళ్లీ సాధారణ వార్తలు మొదలుపెట్టింది. నాలుగురోజులపాటు శ్రీదేవి వార్తలతోనే మీడియా నిండిపోయింది. దుబాయ్ లో వివాదాస్పద మరణం, ఆమె మృతిపై తలెత్తిన అనుమానాలు, భౌతికకాయం స్వదేశం చేరడం, అంత్యక్రియలపై వార్తలు, ప్రత్యేకకథనాలు అన్ని జాతీయ, ప్రాంతీయ చానళ్లనిండా హోరెత్తాయి. శ్రీదేవి అంత్యక్రియలు ముగిసిన తర్వాతనే… చానళ్లన్నీ మిగిలిన వార్తలు యథావిధిగా ప్రసారం చేయడం మొదలుపెట్టాయి. ఈ నేపథ్యంలో శ్రీదేవి కుటుంబసభ్యులు కూడా మీడియాకు ఓ విజ్ఞప్తి చేశారు. శ్రీదేవి చివరిమజిలీ పూర్తయిన తర్వాత కపూర్, అయ్యప్పన్, మార్వా కుటుంబాల నుంచి ఓ సంయుక్త ప్రకటన విడుదలయింది. శ్రీదేవి మరణంతో తాము ఎంతో వేదన అనుభవిస్తున్నామని, ఏకాంతంగా కూర్చుని ఆ బాధ అనుభవించడానికి తమకు అవకాశం ఇవ్వాలని, మీడియా తమకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
శ్రీదేవి కుమార్తెలు జాన్వీ, ఖుషికి అండగా నిలబడినందుకు ధన్యవాదాలు తెలిపారు. శ్రీదేవి జీవితాంతం గౌరవంగా బతికారని, ఇకపై కూడా అదే గౌరవాన్ని కొనసాగించాలని కోరారు. కొన్నిరోజులుగా తాము విషమపరిస్థితి ఎదుర్కొంటున్నామని, తాము ప్రశాంతంగా దుఃఖించేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. కష్టకాలంలో అండగా నిలిచిన శ్రీదేవి స్నేహితులు, తోటి నటులు, వెలకట్టలేని అభిమానులు, దేశం, ప్రపంచం, మీడియా ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. జాన్వి, ఖుషీకి కుటుంబం ఎప్పటికీ చేదోడువాదోడుగా ఉంటుందని, ఇంతవరకు శ్రీదేవిపై చూపిన ప్రేమ వారిపై కూడా చూపించి, తల్లిలేని బాధ నుంచి వారిని కోలుకునేలా చేద్దామని, వారికి అండగా నిలిచి శ్రీదేవి వారికోసం కలలు కన్న భవిష్యత్తును వారికి అందిద్దామని ప్రకటనలో బంధువులు కోరారు. ఈ ప్రకటనతోపాటు బోనీకపూర్ శ్రీదేవి అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ లో ఉద్వేగభరితంగా మరో ప్రకటన చేశారు.
స్నేహితురాలు, భార్య, ఇద్దరు పిల్లలకు తల్లి అయిన వ్యక్తిని కోల్పోవడం మాటల్లో చెప్పలేనంత నష్టమని బోనీ ఆవేదన వ్యక్తంచేశారు. తన బిడ్డలు అర్జున్, అన్షులా ఇద్దరూ జాన్వి, ఖుషికి ఎంతో మనోధైర్యాన్ని ఇచ్చారని, అండగా నిలబడ్డారని, భరించలేని ఈ నష్టాన్ని ఎదుర్కోవడానికి ఒక కుటుంబంగా తాము కలిసి ప్రయత్నించామని బోనీ చెప్పారు. ఈ ప్రపంచానికి ఆమె ఒక చాందిని… శ్రీదేవి… నాకు మాత్రం ఆమె నా ప్రేమమూర్తి, స్నేహితురాలు, మా అమ్మాయిలకు తల్లి. నా జీవిత భాగస్వామి. మా ఇద్దరు అమ్మాయిలకు ఆమే సర్వస్వం. ఆమే వారి జీవితం. మా జీవితాన్ని నడిపిన ఇరుసు. నా ప్రియమైన శ్రీమతికి, ఖుషి, జాన్వి మాతృమూర్తికి మేము వీడ్కోలు పలికిన ఈ సమయంలో నాదొక హృదయపూర్వక విజ్ఞప్తి. మేము ఏకాంతంగా దుఃఖించాల్సిన మా అవసరాన్ని గౌరవించండి. ఈ సమయంలో నా ఆందోళన అంతా ఒకటే. నా కుమార్తెలను రక్షించుకోవడం, స్త్రీ లేకుండానే ముందుకు వెళ్లే మార్గం చూసుకోవడం. ఆమె మా జీవితం, మా బలం, మేము సదా నవ్వుతూ ఉండడానికి ఆమే కారణం. మేము ఆమెను అమితంగా ప్రేమిస్తున్నాం. నా ప్రియతమా నీ ఆత్మకు శాంతి కలుగుగాక. మా జీవితాలు మాత్రం మునుపటిలా ఎప్పటికీ ఉండబోవు అని బోనీకపూర్ ఆవేదనాభరిత ప్రకటన చేశారు.