Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
హిందుత్వంపై, బ్రాహ్మణిజంపై వీలుచిక్కినప్పుడల్లా విమర్శలు గుప్పించే కంచె ఐలయ్య ఈ సారి వైశ్యులపై విషం గక్కటం సంచలనం సృష్టిస్తోంది. సోషల్ మీడియాలో కంచె ఐలయ్యకు వ్యతిరేకంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైశ్యులు ఊరూవాడా నిరసనలు చేస్తున్నారు. ప్రొఫెసర్, సామాజిక రచయిత అయిన కంచె ఐలయ్య మేధావి వర్గానికి చెందిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఆయన రచనలు కొన్ని ఇతర భాషల్లోకి అనువాదం కూడా అయ్యాయి. ఆయన రాసిన నేను హిందువునెట్లయిత? ఇంగ్లీషు అనువాదం వై ఐ యామ్ నాట్ ఏ హిందూ జాతీయస్థాయిలో పేరుతెచ్చుకుంది.
అయితే హిందువులకు, బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా సాగే ఆయన రచనలపై కొన్ని వర్గాల్లో వ్యతిరేకత కూడా పెద్ద స్థాయిలోనే ఉంది. పలుసార్లు బ్రాహ్మణ సంఘాలు ఆయన ధోరణిపై నిరసనలు వ్యక్తంచేశాయి. . ఇప్పుడిక వైశ్యుల వంతు వచ్చింది. సామజిక స్మగ్లర్లు కోమటోళ్లు పేరుతో ఆయన రాసిన పుస్తకంపై తెలుగు రాష్ట్రాల్లో వైశ్యులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. పుస్తకం పేరే సామాజిక స్మగర్లు అని పెట్టడమే కాకుండా…కోమటోళ్లు అంటూ వెటకారమాటడంపై వైశ్యులు ఆగ్రహోదగ్రులవుతున్నారుజ పలుచోట్ల కంచె ఐలయ్య దిష్టిబొమ్మలను వైశ్యులు తగలబెడుతున్నారు. నిరసనప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. . ఫేస్ బుక్ లో, వాట్సప్ లో కంచె ఐలయ్యకు వ్యతిరేకంగా పోస్టులు వెల్లువెత్తుతున్నాయి.. ఫేస్ బుక్ లో, వాట్సప్ లో కంచె ఐలయ్యకు వ్యతిరేకంగా పోస్టులు వెల్లువెత్తుతున్నాయి.
వాట్సప్ గ్రూపుల్లో ఐలయ్య ఫోన్ నెంబర్ షేర్ చేసుకుంటున్నారు. కొందరు ఇప్పటికే ఆ నెంబరు కు ఫోన్ చేసి తిట్టటం, నిలదీయటం వంటివి చేశారు. ఇది భరించలేక కంచె ఐలయ్య తన ఫోన్ స్విచ్చాఫ్ చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఐలయ్య ఫోన్ ఆన్ చేస్తే …మెసేజ్ లు, ఫోన్ కాల్స్ తో దూషణలకు దిగాలని వైశ్యసంఘాలు ఎదురుచూస్తున్నాయి. మరోవైపు దీనిపై కంచె ఐలయ్య పోలీసులను ఆశ్రయించారు. తాను గతంలో ఎన్నడో రాసిన పుస్తకాన్ని ఇప్పుడు వెలుగులోకి తెచ్చి వివాదం చేశారని ఐలయ్య ఆరోపించారు. కొందరు తనను హత్యచేస్తామని బెదిరిస్తున్నారని, తన ప్రాణాలను కాపాడాలని ఆయన హైదరాబాద్ ఉస్మానియా యూనివర్శిటీ పోలీసులకు ఫిర్యాదుచేశారు. తనకు ఫోన్‌చేసిన వారి ఫోన్ నెంబర్లను పోలీసులకు తెలియజేసిన ఐలయ్య వారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కాగా, కర్నూల్, అనంతపురం జిల్లాల్లో ఐలయ్యపై వైశ్యసంఘాలు పలు సెక్షన్ల కింద కేసుపెట్టాయి. వైశ్యులను కించపరిచేలా పుస్తకం రాసిన ఐలయ్యను వెంటనే అరెస్టు చేయాలని, పుస్తకాన్ని నిషేధించాలని వారు కోరుతున్నారు. మరోవైపు పుస్తకం పేరులో కోమటోళ్లు అని రాయటాన్ని ఐలయ్య సమర్థించుకున్నారు. తెలంగాణలో కోమటోళ్లను కోమట్లనే అందరూ అంటారని ఐలయ్య చెప్పారు. తాను ఎవరినీ విమర్శించలేదని, విమర్శించాల్సిన అవసరం కూడా లేదని ఆయన అన్నారు.
కులాల సంస్కృతిని వివరించే సందర్భంగా ఈ పుస్తకం రాశానని చెప్పారు. తెలుగులో కోమట్లు అని ఇంగ్లీషులో బనియా అని రాశానని తెలిపారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా గాంధీని చతుర్బనియా(తెలివైన వైశ్యుడు) అనడాన్ని ఆయన గుర్తుచేశారు. గ్రామీణ వ్యాపార వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకుని గ్రామాల్లో అంటరానితనం జడలు విప్పడంలో కోమట్లు కూడా భాగస్వామ్యులయ్యారని ఐలయ్య ఆరోపించారు. తనకు కూడా అలాంటి అనుభవాలు ఎదురయ్యాయన్నారు. అంటరానితనాన్ని రూపుమాపటానికి ఆర్యవైశ్యులు కృషిచేయాలని ఆయన కోరారు. గ్రామాల్లో దళితులు, ఇతర సామాజిక వర్గాలకు వ్యాపారంలో భాగం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే ఐలయ్య వాదనను వైశ్యులే కాక ఇతర సామాజిక వర్గాలూ తోసిపుచ్చుతున్నాయి. సామాజిక స్మగ్లర్లు అనటం ద్వారా ఐలయ్య వైశ్యజాతి మొత్తాన్ని అవమానించారని, ఎవరైనా తమ కులాన్ని, మతాన్ని పొగుడుకుంటే తప్పులేదని…కానీ ఇతరుల కులంపై వెటకారపు వ్యాఖ్యలుచేస్తూ ..బురద చల్లడం సరైనది కాదని పలువురు అంటున్నారు.
మరిన్ని వార్తలు:
అర్జున రణతుంగ వివాదాస్పద వ్యాఖ్య
40 ఏళ్లు వచ్చిన తరువాతే రిటైర్మెంట్