ఏపీలోని కర్నూలు జిల్లాలో వృద్ధురాలు మోసానికి గురైంది. అదేమంటే… వృద్ధురాలు పెన్షన్ డబ్బులను ఓ యువకుడు కాజేసిన వైనం చోటుచేసుకుంది. కన్నీటి పర్యంతమైన ఆ వృద్ధురాలిది కర్నూలు జిల్లా ఆదోని పట్టణం.
అయితే లాక్డౌన్ సమయంలో కడుపు నిండా తినడానికే వృద్ధులు ఇబ్బంది పడుతున్నారు. ఉపాధి లేక ప్రభుత్వం ఇచ్చే పెన్షన్‌తోనే కాలం వెళ్లదీస్తున్న వేళ కొందరు దుర్మార్గులు వారి డబ్బుపైనే కన్నేశారు. కర్నూలు జిల్లా ఆదోనిలో వృద్ధురాలికి ఓ ఆగంతకుడు ఇలాగే శోకం మిగిల్చాడు. ప్రభుత్వం అందించిన వృద్ధాప్య పింఛను రూ.2,250, పోలీసుల కోసం వంట చేయడానికి వచ్చిన రూ.600 మొత్తం కలిపి చీరకొంగులో పెట్టుకొని వస్తుంది. ఆ సమయంలో ఆ నగదు కిందపడిపోయింది.
కాగా ఆమె ఆ విషయాన్ని గుర్తించేలోపే ఓ యువకుడు ఆ నగదును ఎత్తుకొని పరారయ్యాడు. దీంతో బాధితురాలు లక్ష్మమ్మ కన్నీటి పర్యంతమై పోయింది. స్థానిక రెడ్డీస్ హాస్టల్లో లక్ష్మమ్మ పోలీసుల కోసం భోజనం వండి ఇంటికి వెళ్తుండగా రైల్వేస్టేషన్ రహదారిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ విషయంపై ఆదోని టూటౌన్ పోలీసుస్టేషన్లో ఆ వృద్ధురాలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.