Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నాయకుల రాజకీయ జీవితంపై సోషల్ మీడియా ఎంత ప్రభావం చూపుతోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బీజేపీ, కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీలతో పాటు చాలా ప్రాంతీయ పార్టీలు సోషల్ మీడియాను ప్రధాన క్యాంపెయినర్ గా భావిస్తున్నాయి. ఎన్నికలకు చాలా రోజుల ముందు నుంచే ఆయా పార్టీల నేతలు ప్రత్యర్థులపై సోషల్ మీడియా వేదికగా వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు. ఓ రకంగా చెప్పాలంటే సోషల్ మీడియా ప్రచారంలో ఎవరు ముందుంటే వారే విజేతగా భావించే పరిస్థితి ఏర్పడింది. అందుకే ఇప్పుడు ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ వంటి మాద్యమాల్లో తమపై వచ్చే ఆరోపణలను ఎవరూ తేలిగ్గా తీసుకోవడం లేదు. ఒకప్పుడయితే ఇలాంటివి నేతలు పెద్దగా పట్టించుకునేవాళ్లు కాదు గానీ… ఇప్పుడు మాత్రం పోలీస్ స్టేషన్ మెట్లు కూడా ఎక్కుతున్నారు.
తాజాగా గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఓ టీడీపీ మద్దతుదారుడు పెట్టిన పోస్ట్ ఇప్పుడా నియోజకవర్గంలో దుమారం రేపుతోంది. 2019 ఎన్నికల్లో మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్టారెడ్డికి టికెట్ రాదని, వైసీపీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సర్వేలో పిన్నెల్లి ఓడిపోతారని తేలిందని టీడీపీ ఇన్ చార్జ్ చలమారెడ్డి సన్నిహితుడు బ్రహ్మారెడ్డి ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. పిన్నెల్లిపై వైసీపీ అధినేత జగన్ కూడా ఆగ్రహంగా ఉన్నారని, మరో సామాజిక వర్గ నేతకు టికెట్ ఇచ్చేందుకు సన్నాహకాలు కూడా జరుగుతున్నాయని తన పోస్ట్ లో బ్రహ్మారెడ్డి పేర్కొన్నారు. ఈ పోస్ట్ నియోజకవర్గంలో తీవ్ర కలకలం రేపింది. బ్రహ్మారెడ్డి వ్యాఖ్యలపై పిన్నెల్లి అనుచరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.
బ్రహ్మారెడ్డి కావాలనే ఇలాంటి ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో పిన్నెల్లి తనను చంపుతానని ఫోన్ లో బెదిరించారని ఆరోపిస్తూ బ్రహ్మారెడ్డి తండ్రి వీరారెడ్డి అర్బన్ సీఐకి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన పిన్నెల్లి తాను చంపుతానని బెదిరించినట్టు రుజువు చేస్తే కేసు పెట్టుకోవచ్చని సూచించారు. స్వయంగా పోలీస్ స్టేషన్ కు వచ్చి ఎస్సైతో సమావేశమై దీనిపై వివరణ ఇచ్చారు. రెండు దశాబ్దాల పాటు వీరారెడ్డి తన వద్దే ఉన్నాడని, ఆ తర్వాత పార్టీ మారారని, తనపై పోస్ట్ పెట్టిన బ్రహ్మారెడ్డికి ఫోన్ చేస్తే అపార్థం చేసుకునే అవకాశం ఉంటుందన్న భావనతో… ఒకప్పుడు తనతో చనువుగా ఉన్న వీరారెడ్డికి ఫోన్ చేశానని, ఇలాంటివి అనవసరం అని మాత్రమే ఆయనతో చెప్పానని పిన్నెల్లి ఎస్ ఐకు వివరించారు. మొత్తానికి ఈ గొడవ అంతా చూస్తుంటే… సోషల్ మీడియాను జాతీయస్థాయి నేతలే కాదు… స్థానిక నేతలు కూడా ఎంత సీరియస్ గా పరిగణిస్తున్నారో అర్ధమవుతోంది.