Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
హాస్యబ్రహ్మ బ్రహ్మానందం కొన్ని సంవత్సరాల క్రితం వరకు మోస్ట్ వాంటెడ్ కమెడియన్. బ్రహ్మానందం ఏ సినిమా చేసినా కూడా అది సూపర్ హిట్ ఖాయం. స్టార్ హీరోలు సైతం తమ సినిమాలో బ్రహ్మానందం ఉండాల్సిందే అంటూ పట్టుబట్టే వారు. అప్పట్లోనే బ్రహ్మానందంకు రోజుకు మూడు నుండి అయిదు లక్షల వరకు పారితోషికం ఇచ్చే వారు. బ్రహ్మానందం రికార్డు స్థాయిలో సినిమాలు చేసి, ప్రేక్షకులను నవ్వించాడు. ఇక గత కొంత కాలంగా బ్రహ్మానందం కామెడీని ప్రేక్షకులు ఆస్వాదించలేక పోతున్నారు. ఈతరం ప్రేక్షకులు కొత్త తరహా కామెడీని కోరుకుంటున్నారు. కాని బ్రహ్మానందంతో దర్శకులు మాత్రం మూస కామెడీని ప్రయత్నిస్తున్నారు. బ్రహ్మానందం అంటే ఒక రకమైన కామెడీ అందరికి గుర్తుకు వస్తుంది. సినిమాల్లో దర్శకులు అదే తరహాలో చూపిస్తున్న కారణంగా ప్రేక్షకులు ఆధరించడం లేదు.
ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించిన బ్రహ్మానందం ఈమద్య మరీ దారుణమైన పాత్రల్లో కనిపిస్తున్నాడు. తన స్థాయికి తగ్గ పాత్రలు కాకుండా ఎలాగైనా నవ్వించాలి, ఎలాగైనా మళ్లీ ఫాంలోకి రావాలనే ఉద్దేశ్యంతో పిచ్చి పిచ్చి పాత్రలు అన్ని ఓకే చెబుతున్నాడు. తాజాగా వచ్చిన నేలటిక్కెట్టు చిత్రంలో బ్రహ్మానందం ఒక బిచ్చగాడి పాత్రలో కనిపించాడు. ఇలాంటి పాత్రను బ్రహ్మానందం ఎలా ఒప్పుకున్నాడో ఆయనకే తెలియాలి. కనీస ప్రాముఖ్యత లేని ఆ పాత్ర కనీసం నవ్వించడంలో కూడా విఫలం అయ్యింది. బ్రహ్మానందం వంటి ఒక గొప్ప నటుడికి దర్శకుడు ఇలాంటి పాత్రను ఇస్తాడా అంటూ కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్రహ్మానందం కాస్త ఆలోచించి మంచి పాత్రల్లో నటించాలని, ఆయన స్థాయిని నిలుపుకునేలా పాత్రలు ఎంపిక చేసుకోవాలని సూచిస్తున్నారు.