Breaking : నారా లోకేష్ పాదయాత్రకు బ్రేక్ పడింది. మిచౌంగ్ తుఫాన్ దూసుకొస్తుండటంతో యువగలం పాదయాత్రకు మూడు రోజుల విరామం ప్రకటించారు. ప్రస్తుతం కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని ఉప్పాడ కొత్తపల్లి తీరంలో పొన్నాడ శీలంవారి పాకల వద్దకు పాదయాత్ర చేరుకుంది.
రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తోడు ఈదురు గాలులు బలంగా వీస్తున్నాయి. దీంతో లోకేష్ పాదయాత్రకు విరామం ప్రకటించారు. ఈ నెల 7న మళ్ళీ పాదయాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు.
కాగా, ఇవాళ కోస్తా తీరానికి సమాంతరంగా పయనించనున్న తుపాను.. మంగళవారం మధ్యాహ్నం నాటికి తీవ్ర తుపానుగా మారి నెల్లూరు-మచిలీపట్నం మధ్య తీరం దాటనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని సూచించారు. మరోవైపు తుపాను ప్రభావంతో ఏపీ అప్రమత్తమైంది. ముఖ్యంగా విశాఖపట్నం, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం వంటి పలు జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు.