టీడీపీ నేత, అంబికా కృష్ణ సోదరుడు అంబికా సంస్థల అధినేత అంబికా రాజా ఈరోజు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. పశ్చిమగోదావరిలోని ఏలూరు వైసీపీ కార్యాలయంలో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని సమక్షంలో ఆయన వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా అంబికా రాజాకు వైసీపీ కండువా కప్పిన నాని, పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఆళ్ల నాని మాట్లాడుతూ.. అంబికా రాజా రాష్ట్రంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. ఆర్యవైశ్య సామాజికవర్గానికి చెందిన ప్రజలకు సాయం చేశారని ప్రశంసించారు. వైసీపీలో చేరిన ఆయన సీఎం జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు చేరేలా కృషి చేయాలని కోరారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం సాధించడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. అంబికా రాజా సోదరుడు అంబికా కృష్ణ ఇటీవల టీడీపీని వీడి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే.