పక్క దేశమైన శ్రీలంకలో చోటు చేసుకున్న ఆసక్తికరమైన రాజకీయ పరిణామం ఇది. శ్రీలంక ప్రధానమంత్రిగా మహింద రాజపక్స ప్రమాణం చేశారు. గురువారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆ దేశ అధ్యక్షుడు గొటబయ రాజపక్స.. మహిందతో ప్రమాణం చేయించారు.
మహింద రాజపక్సేను శ్రీలంక ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయించిన గొటాభయా రాజపక్సే ఎవరో కాదండి…ఆయన సొంత అన్నే. తన తమ్ముడు ప్రెసిడెంట్గా ఎన్నికైన కొద్ది రోజులకే మహింద కూడా ప్రధానిగా బాధ్యతలు స్వీకరించడం గమనార్హం. లంక మాజీ ప్రధాని రనీల్ విక్రమ సింఘే, మాజీ ప్రెసిడెంట్ మైత్రిపాల సిరిసేన, ప్రముఖ రాజకీయనాయకులు ప్రమాణస్వీకారోత్సవంలో పాల్గొన్నారు.
కాగా, శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో తమ పార్టీకి పరాభవం ఎదురైన నేపథ్యంలో ప్రధాని రణిల్ విక్రమసింఘే తన పదవికి రాజీనామా చేశారు. విక్రమసింఘే అధికారికంగా పదవి నుంచి వైదొలిగిన అనంతరం,శ్రీలంక తదుపరి ప్రధానిగా తన సోదరుడు మహింద రాజపక్స పేరును ఆ దేశ నూతన అధ్యక్షుడు గోటబయ రాజపక్స ఖరారు చేశారు.
దీంతో ప్రతిపక్ష నేత మహింద రాజపక్స ప్రధానిగా ప్రమాణం చేశారు. మహింద రాజపక్స (74) 2000-2015 మధ్య శ్రీలంక అధ్యక్షుడిగా, గత ఏడాది అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ప్రధానమంత్రిగా పనిచేశారు. మహింద నియామకంతో దేశంలోని రెండు ప్రధాన పదవులైన రాష్ట్రపతి, ప్రధానమంత్రి పదవులు రాజపక్స వంశం చేతిలోకి వచ్చినట్టయింది.దీంతో లంకలో రాజపక్సే కుటుంబం రాజకీయంగా బాగా బలపడినట్టే అని విశ్లేషకులు చెప్పారు.
మహింద వచ్చే ఏడాది ఆగస్టు వరకు ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగనున్నారు. ఆగస్టులో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. మరోవైపు తాజా ఎన్నికల్లో అధికార యూఎన్పీ ఓడిపోయిన నేపథ్యంలో పార్టీ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకోవాలని విక్రమసింఘెపై ఒత్తిడి పెరుగుతోంది.