Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఇండియా- చైనా బోర్డర్లో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతపై రెండు దేశాల నేతలు విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటున్నారు. చానాళ్లుగా సరిహద్దుల్లో ఇదే పరిస్థితి నెలకొంది. డోక్లామ్ నుంచి భారత్ వెనక్కి తగ్గకపోతే యుద్ధం తప్పదన్న పరోక్ష సంకేతాలు చైనా పంపించింది. దానికి ఇండియా తమది 1962 నాటి దేశం కాదని భారత్ బదులిచ్చింది. తమదీ 1962 నాటి దేశం కాదని చైనా ప్రతిస్పందించింది. చైనా వైఖరికి వ్యతిరేకంగా భారత్ లో ఆ దేశ వస్తువుల బహిష్కరణ కొనసాగుతోంది. చైనా కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే రెండు దేశాల మధ్య నెలకొన్న వివాదంపై ఎవరెవరు ఎన్ని వ్యాఖ్యానాలు చేసినా ఓ వ్యక్తి స్పందన కోసం అంతా ఎదురుచూశారు. ఆయనే టిబెట్
ఆధ్యాత్మిక వేత్త, బౌద్ధుల గురువు దలైలామా. చైనాను తీవ్రంగా వ్యతిరేకించే దలైలామా ప్రస్తుత వివాదాన్ని ఎలా చూస్తారో్ అని అంతా ఆసక్తిగా గమనించారు. అయితే దలైలామా మాత్రం దీన్ని తేలిగ్గా తీసిపారేశారు. ఇదసలు సీరియస్ విషయమే కాదన్నారు దలైలామా. భారత్, చైనా ఎప్పటికీ సోదరదేశాలే అన్న ఆయన డోక్లామ్ సమస్య అంత తీవ్రమైనది కాదన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. చైనా, భారత్ రెండూ పెద్ద దేశాలే అని, ఈ రెండింటి మధ్య గతంలోనూ సరిహద్దు సమస్యలు నెలకొన్నా, 1962లో మినహా అన్ని సందర్భాల్లో శాంతియుతంగానే పరిష్కరించుకున్నారని దలైలామా గుర్తుచేశారు.
2005 నుంచి ఇరుదేశాల మధ్య బలోపేతమైన సంబంధాలు ఇటీవల కాస్త దెబ్బతిన్నా…హిందీ, చైనీ భాయీ భాయీ అంటూ సమస్యను పరిష్కరించుకుంటారని దలైలామా ఆశాభావం వ్యక్తంచేశారు. ప్రస్తుత సందర్బంలో భారత్ అనుసరిస్తున్న వైఖరిని ఆయన ప్రశంసించారు. భారత్ లో భావవ్యక్తీకరణకు ఎలాంటి ఆంక్షలు ఉండవని, అందుకే తాను స్వేచ్ఛగా అభిప్రాయాలను వెల్లడిస్తానని దలైలామా చెప్పారు. భారత్, చైనా మధ్య ఉద్రిక్తతలు ఇప్పుడిప్పుడే కాస్త తగ్గుతున్న నేపథ్యంలో దలైలామా వ్యాఖ్యలు మరింత ఆశాజనకంగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.