చాలా సంవత్సరాల తర్వాత ఏపీ ప్రభుత్వం నంది అవార్డులను ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. 2014, 15, 16 సంవత్సరాలకు గాను నంది అవార్డుల విజేతలను జ్యూరీ ప్రకటించిన విషయం తెల్సిందే. నంది అవార్డుల విజేత ఎంపిక విషయంలో విమర్శలు వ్యక్తం అవుతున్న విషయం తెల్సిందే. తాజాగా మెగా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడు అయిన బన్నీ వాసు నంది అవార్డుల ఎంపిక విషయంలో అసహనం వ్యక్తం చేస్తూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. ఆయన చేసిన పోస్ట్ ప్రస్తుతం సినీ వర్గాల్లో మరియు రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతోంది. సోషల్ మీడియాలో కొందరు నంది అవార్డుల గురించి విమర్శలు చేశారు. కాని ఇలా నేరుగా సినిమా పరిశ్రమకు చెందిన వారు మాత్రం విమర్శలు చేయడం ఇదే.
బన్నీకి ఆప్త మిత్రుడు, అల్లు అరవింద్‌కు రైట్ హ్యాండ్ అయిన బన్నీ వాసు తాజాగా ఫేస్‌బుక్‌లో నంది అవార్డులపై స్పందిస్తూ మెగా హీరోలు తెలుగు దేశం ప్రభుత్వం నుండి నటనను నేర్చుకోవాల్సిన అవసరం ఉందని, రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు దక్కించుకోవాలంటే మెగా హీరోలు ఇంకా నటనలో మెరుగు పడాల్సి ఉందంటూ బన్నీ వాసు సెటైరికల్‌గా కామెంట్స్ చేయడం జరిగింది. బన్నీ వాసు చేసిన ఆ పోస్ట్ ప్రస్తుతం సినీ వర్గాల్లో మరియు మీడియా వర్గాల్లో చర్చనీయాంశం అవుతుంది. బన్నీ వాసు ఇప్పటి వరకు ఆ పోస్ట్ గురించి అధికారికంగా మాట్లాడినది లేదు. కాని మెగా కాంపౌండ్‌లో నంది అవార్డుల విషయంలో ఏ స్థాయిలో ఆగ్రహం ఉంది అనే విషయం ఆయన పోస్ట్ చెప్పకనే చెబుతుంది. మూడు సంవత్సరాల అవార్డులు ప్రకటించినా కూడా అందులో ఒక్కటి కూడా మెగా మూవీ లేక పోవడం, మెగా హీరోకు రాకపోవడం మెగా ఫ్యాన్స్‌ను తీవ్రంగా కలిసి వేస్తున్న అంశం.