Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఆంధ్రప్రదేశ్ సర్కార్ నంది అవార్డులు ప్రకటించినప్పుడు బన్నీ వాసు ఎంత హడావిడి చేశారో ఇంకా జనం మదిలోనుంచి తొలిగిపోలేదు. మెగా క్యాంపు హీరోలకు అవార్డుల విషయంలో అన్యాయం జరిగిందని అందుకు కులమే కారణమని బన్నీ వాసు చేసిన ఆరోపణలతో నానా రచ్చ అయ్యింది. ఆ ఆరోపణలతో నిజంగానే తన మీద కుల ముద్ర పడుతుందేమోనని ప్రభుత్వం కూడా భయపడింది. అయితే సోషల్ మీడియాలో బన్నీ వాసు వాదన ని తప్పుబడుతూ పెద్ద ఎత్తున కౌంటర్లు రావడంతో ఆయన కూడా కాస్త ఇబ్బందిగానే సైలెంట్ అయిపోయారు.
ఇప్పుడు సంక్రాంతి సీజన్ లో వస్తున్న అజ్ఞాతవాసి సినిమా ని రోజుకి ఏడు షో లు వేసుకోడానికి చంద్రబాబు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ వార్త బయటకు రాగానే బన్నీ వాసు సానుకూలంగా స్పందించారు. ఇలాంటి నిర్ణయాలతో ఆంధ్రప్రదేశ్ లో చిత్ర పరిశ్రమ వృద్ధి చెందుతుందని కూడా వాసు చెప్పేసారు. రానున్న రోజుల్లో కూడా ఇలాంటి నిర్ణయాలు కొనసాగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. నంది అవార్డుల ప్రకటన సమయంలో ఇదే చంద్రబాబు సర్కార్ కి కులం , మెగా క్యాంపు వ్యతిరేకత వంటి వాటిని అంటకట్టడానికి ఒక్క క్షణం కూడా ముందువెనుక ఆలోచించని బన్నీ వాసు కి ఇప్పుడు మాత్రం అలాంటివి ఏమీ గుర్తుకు రాలేదు. ఇప్పుడు అంటే ప్రత్యేక అనుమతి పొందిన అజ్ఞాతవాసి హీరో పవన్ కళ్యాణ్ మెగా క్యాంపు కి చెందడా ? ఆయనది కాపు కులం కాదా ? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పడం బన్నీ వాసుకి ఇబ్బంది కావొచ్చు. నిజానికి ఇప్పుడు ఆయన కుల కోణంలో మాట్లాడాలని చెప్పడం మా ఉద్దేశం కాదు. అప్పుడు …అంటే నంది అవార్డుల సమయంలో కూడా ఆ మాత్రం సంయమనం పాటించి వుండాల్సింది.