తెలంగాణాలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కొద్దిసేపటి క్రితం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కొండగట్టు ఘాట్ రోడ్డు వద్ద ఓ ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తాపడింది. కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకుని వస్తూ మృత్యువు పాలయ్యారు. కొండగట్టు నుంచి జగిత్యాల వైపు వెళుతున్నఆర్టీసీ బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది.
ఈ దుర్ఘటనలో 23 మంది దుర్మరణం పాలవగా , మరో ఇరవైమంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రమాద విషయం తెలియడంతో జిల్లా ఎస్పీ సింధూ శర్మ, కలెక్టర్ ఘటనాస్థలానికి చేరుకున్నారు. ప్రమాదం స్థలంలో కొనసాగుతున్న సహాయక చర్యలను అధికారులు పరిశీలిస్తున్నారు. గాయపడిన వారిని సమీపంలోని జగిత్యాల ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 60 మంది ఉన్నట్లు సమాచారం. ప్రమాదానికి కారణమైన బస్సు జగిత్యాల డిపోకు చెందినదిగా గుర్తించారు. ప్రమాద తీవ్రత దృష్ట్యా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.