బాలీవుడ్ విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ తమ్ముడు.. తొమ్మిదేళ్ల వయసులో తనను లైంగిక వేధింపులకు గురిచేశాడని వారి కూతురు(వరుసకు) పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు మంగళవారం ఢిల్లీలోని జమీనా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ..‘‘ నాకు రెండేళ్లు ఉన్నపుడు మా అమ్మానాన్న విడిపోయారు. మా నాన్న రెండో పెళ్లి చేసుకున్నారు. తొమ్మిదేళ్ల వయసులో మా చిన్నాన్న(నవాజుద్దీన్ తమ్ముడు)నన్ను లైంగికంగా ఇబ్బంది పెట్టారు. నేను ఎంతో హింసకు గురయ్యాను. నాకప్పుడు ఆ విషయం అర్థం అయ్యేది కాదు. పెద్దయ్యాక అతడి చేష్టలను గుర్తించాను.
పెళ్లైన తర్వాత కూడా వారి(నటుడి కుటుంబం) వేధింపులు తగ్గలేదు. మా అత్తింటి వారిపై తప్పుడు కేసులు పెట్టి హింసించేవారు. ఓ రోజు పెదనాన్న(నవాజుద్దీన్) నన్ను ‘నువ్వు ఏం అవ్వాలనుకుంటున్నావు?’ అని అడిగారు. అప్పుడు నేను, నాపై జరిగిన లైంగిక వేధింపుల గురించి చెప్పాను. మానసికంగా బాగా కృంగిపోయానని అన్నాను. ఆయన మాత్రం అలా ఏం జరిగి ఉండదన్నారు. ‘అతను నీ చిన్నాన్న, అలా ఎప్పుడూ చేయడు’ అన్నారు. కనీసం పెదనాన్న అయినా నన్ను అర్థం చేసుకుంటారనుకున్నాను. కానీ అలా జరగలేదు ’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.