Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
యాంగ్రీయంగ్ మన్ రాజశేఖర్ ఇటీవలే చిన్న యాక్సిడెంట్ చేసిన విషయం తెల్సిందే. ఆ యాక్సిడెంట్ విషయంలో పోలీసులు కల్పించుకుని ఇద్దరికి సర్ది చెప్పి కేసు లేకుండా చూడగలిగారు. రాజశేఖర్ తల్లి చనిపోయిన డిప్రెషన్‌లో యాక్సిడెంట్ చేశాడని పోలీసులు గ్రహించి కేసు పెట్టకుండా రాజీ కుదిర్చడం జరిగింది. తాజాగా రాజశేఖర్ నటించిన ‘గరుడవేగ’ చిత్రం విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో కుటుంబం అంతా కూడా చాలా కాలం తర్వాత చాలా సంతోషంగా ఉన్నారు. ఆ సంతోషం కొన్ని రోజులు కూడా నిలవకుండానే మరో వివాదంలో రాజశేఖర్ కుటుంబం ఇరుక్కోవడం జరిగింది.
తాజాగా రాజశేఖర్, జీవితల పెద్ద కూతురు శివానీ జూబ్లీహిల్స్‌లో కారు డ్రైవ్ చేస్తూ రోడ్డు పక్కన ఆగి ఉన్న ఒక కొత్త కారును ఢీ కొట్టింది. ఆ కారు కొని మూడు వారాలు కూడా కాలేదు. దాంతో ఆ ఓనర్ బో దిబో అంటూ శివానిపై శివాలెత్తాడు. తాను ఫిర్యాదు ఇవ్వకుండా ఉండాలి అంటే 30 లక్షల రూపాయలు తనకు నష్టపరిహారం ఇవ్వాల్సిందే అంటూ డిమాండ్ చేశాడు. కాని రాజశేఖర్ ఫ్యామిలీ మాత్రం అయిదు లక్షల వరకు నష్టపరిహారం ఇస్తామంటూ చెప్పడంతో ఆయన కాదని పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆగి ఉన్న కారును శివాని ఢీ కొట్టినట్లుగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు అయ్యింది. త్వరలోనే పోలీసుల ఎదుట శివాని విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. ఇటీవలే ఎంబీబీఎస్ పూర్తి చేసిన శివాని త్వరలోనే హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వాలనే ప్రయత్నాల్లో ఉంది.