Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
దాణా కుంభకోణం కేసులో రాంచీలోని సీబీఐ ప్రత్యేక కోర్టు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు శిక్ష ఖరారు చేసే సమయంలో ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి దోషులకు ఓపెన్ జైలు సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే వాళ్లకు ఇంతకుముందు ఆవుల పెంపకం చేసిన అనుభవం ఉంది అని చమత్కరించారు. ఈ కేసులో లాలూ సహా మరో ఏడుగురికి మూడున్నరేళ్లపాటు జైలుశిక్ష, ఐదు లక్షల జరిమానా విధిస్తూ శనివారం సాయంత్రం న్యాయమూర్తి శివపాల్ సింగ్ తీర్పు వెలువరించారు.
తీర్పు నేపథ్యంలో సీబీఐ ప్రత్యేక కోర్టు పరిసరప్రాంతాల్లో పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు మోహరించారు. బిర్సాముండా జైలులో ఉన్న లాలూను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయస్థానం విచారణ చేసింది. బీహార్ లో 21 ఏళ్ల క్రితం పశు దాణా కుంభకోణం కేసులో లాలూ తో పాటు మరో 15 మందిని దోషులుగా తేలుస్తూ డిసెంబర్ 23న ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెలువరించింది. జనవరి 3న శిక్ష ఖరారుచేయాల్సి ఉండగా… ఓ న్యాయవాది మృతితో వాయిదా పడింది. అనంతరం మరో రెండు సార్లు వాయిదాపడిన తీర్పును ఎట్టకేలకు శనివారం వెలువరించారు. తన వయసు, ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని శిక్ష ఖరారు చేయాల్సిందిగా లాలూ శుక్రవారం పిటిషన్ దాఖలు చేశారు. అటు సీబీఐ కోర్టు తీర్పుపై హైకోర్టుకు వెళ్తామని లాలూ కుమారుడు, ఆర్జేడీ నేత తేజస్వియాదవ్ చెప్పారు. న్యాయవ్యవస్థ తన పని తాను చేసిందని, తీర్పును పరిశీలించిన తర్వాత తాము హైకోర్టుకు వెళ్తామని ఆయన తెలిపారు. తమకు న్యాయస్థానం మీద గౌరవం, నమ్మకం ఉన్నాయని, తన తండ్రికి తప్పకుండా బెయిల్ వస్తుందని లాలూ మరో కుమారుడు తేజ్ ప్రతాప్ విశ్వాసం వ్యక్తంచేశారు.