పెరోల్ ఖైదీతో టీడీపీ ఎంపీల చర్చలు !

TDP MPs Meet in Lalu Prasad Yadav

ప్రత్యేక హోదా కోసం కేంద్రంతో పోరుకు సిద్దమయిన టీడీపీ తనకు ఉన్న యే మార్గాన్ని వృధా చేయట్లేదు. ఒక పక్క ఏపీ సీఎం చంద్రబాబు అన్ని ప్రధాన పార్టీ నేతలకు లేఖలు రాస్తుంటే ఏపీ టీడీపీ ఎంపీలు కూడా తమదైన శైలిలో మద్దతు కూడగడుతున్నారు. స్పెషల్ స్టేటస్ కోసం విపక్ష వైసీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామాలు చేయగా టీడీపీ ఎంపీలు మాత్రం కేంద్రం తీరును ఎండగడుతూ కాంగ్రెస్, బీజేపీయేతర పక్షాల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. సోమవారం తోట నర్సింహం నాయకత్వంలోని టీడీపీ ఎంపీలు ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్, సీపీఎం నాయకుడు సీతారాం ఏచూరిని కలిశారు.

సీఎం రమేష్ ఆధ్వర్యంలో మరి కొందరు ఎంపీలు కనిమొళి, కుమారస్వామిలను కలిశారు. టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్, రవీంద్ర కుమార్, గరికపాటి మోహన్ రావులు నేడు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌ను పాట్నాలో కలిశారు. అయితే అక్రమాస్తుల కేసులో దోషిగా ఉన్న లాలూ ప్రస్తుతం పెరోల్లో ఉన్నారు. కేంద్రంపై పోరాటంలో తమకు సహకరించాలని చంద్రబాబు రాసిచ్చిన లేఖను ఎంపీలు గల్లా జయదేవ్, రవీంద్ర కుమార్, గరికపాటి మోహన్ రావులు లాలూకు అందజేశారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి మద్దతు ఇవ్వాలని కోరారు. విభజన హామీల అమలు కోసం కేంద్రాన్ని నిలదీసే ప్రయత్నంలో తమకు అండగా నిలవాలని కోరారు.