సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న విష ప్రచారంపై ఆమె హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఫిర్యాదు చేసి మామూలుగా ఉంటె బాగుండేదేమో కానీ ఆంధప్రదేశ్ పోలీసులపై నమ్మకం లేదంటూ షర్మిల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. ఎందుకంటే తాజాగా జరిగిన కోడి కత్తి దాడి సందర్బంగా జగన్ కూడా ఇలానే ఆంధ్రా పోలీసులపై నమ్మకం లేదని వ్యాఖ్యానించి, ఏపీ పోలీసు వ్యవస్థ మొత్తాన్నే అవమానించారు, అంతేకాక ఆ కేసు విచారణలో భాగంగా ఆంధ్రా పోలీసులు జగన్ వద్దకు వెళ్తే కనీస మర్యాద కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ఇదే అంశమై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. విలేకరుల సమావేశంలో ఓ ప్రశ్నకు సమాధానంగా మాట్లాడిన బాబు జగన్, షర్మిలపై ఫైర్ అయ్యారు. ఈ రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేదని అంటున్నప్పుడు, వారు ఈ రాష్ట్ర పౌరులు ఎలా అవుతారంటూ ఆయన నిలదీశారు. ఇండియాలో ఉండేవాళ్లు ఈ దేశం పై నమ్మకం లేదు, వేరే దేశంలో దర్యాప్తు చేయమని వెళ్తే ఎలా ఉంటుందన్నారు. కష్టం ఉన్నప్పుడు ఫిర్యాదు చేయాలి కానీ, ఈ దేశంలో ఉంటూ పోలీసు వ్యవస్థపైనే నమ్మకం లేదని, ఫిర్యాదు చెయ్యను అనడం బాధ్యతా రాహిత్యం కాదా అని ప్రశ్నించారు. ఈ సమాజంలో బాధ్యతాయుతంగా లేనప్పుడు, ఇక్కడి జరిగే ఎన్నికల్లో ఎందుకు పోటీ చేస్తున్నారని ప్రశ్నించారు. హైదరాబాద్ లో కాపురం ఉంటూ, అక్కడ కూర్చుని ఆంధ్రా పోలీసులపై నమ్మకం లేదంటే ఏమనాలంటూ షర్మిల వ్యాఖ్యలను ఉద్దేశించి చంద్రబాబు వ్యాఖ్యానించారు. బెంగళూరులో ఉండేవారు బెంగళూరులోనే కంప్లయింట్ ఇస్తారనీ, చెన్నైలో ఉన్నవారు చెన్నైలో ఇస్తారనీ, అలాగే హైదరాబాద్ లో ఉన్నవారు అక్కడేదైనా జరిగితే అక్కడే కదా ఫిర్యాదు చేయాల్సిందని అన్నారు. అలా హైదరాబాద్ లో కాపురం ఉండి ఆంధ్రా పోలీసు వ్యవస్థపై నమ్మకం లేదంటే మీరు ఎక్కడికి పోతున్నట్టు అని ఆయన ప్రశ్నించారు. ఇక అలాగే జగన్ కోడి కత్తి దాడి కేసును ఉద్దేశించి మాట్లాడుతూ ఘటన విశాఖలో జరిగితే ఇక్కడ ఫిర్యాదు చేయడం మానేసి, ఇప్పుడు ఎన్.ఐ.ఎ. దర్యాప్తు కావాలంటున్నారని చంద్రబాబు అన్నారు. దానికి కేంద్రం కూడా అత్యుత్సాహంతో స్పందించడం చూస్తున్నామన్నారు. ఇదే కేంద్ర ప్రభుత్వం దగ్గరకి ఎవరైనా వెళ్లి, మేం అంతర్జాతీయ న్యాయస్థానంలో కేసు వేస్తాం, అమెరికా ప్రభుత్వానికి ఇస్తాం అంటే ఒప్పుకుంటుందా అని ఆయన ప్రశ్నించారు. ఇండియాలో జరిగిన క్రైమ్ కి వేరే దేశంలో దర్యాప్తుకి ఇస్తారా ఎక్కడైనా అన్నారు. ఈ రాష్ట్ర పౌరుడిగా ఉన్నప్పుడు ఆదర్శవంతంగా ఉండాలన్నారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారని ముఖ్యమంత్రి అన్నారు. వీళ్ళందరికీ వచ్చే ఎన్నికల్లో ప్రజలు గుణ పాఠం చెబుతారని ఆయన పేర్కొన్నారు.