Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఖరారైంది. ఈరోజు రాత్రి బయలుదేరి సీఎం ఢిల్లీ వెళ్లనున్నారు. ఆరుగురు సభ్యులున్న బృదం పర్యటనను ఏపీ ప్రభుత్వం ఖరారు చేసింది. రేపు, ఎల్లుండి అంటే (3,4 తేదీల్లో ) చంద్రబాబు ఢిల్లీలో వివిధ పార్టీల నేతలు, ఎంపీలను కలుస్తారు. ఏపీకి జరిగిన అన్యాయాన్ని వివిధ పార్టీల నేతలకు చంద్రబాబు వివరించనున్నారు. విభజన హామీల అమలు సాధనకు కేంద్రంతో పోరాడేందుకు పార్టీల మద్దతుకూడగట్టనున్నారు.
కేంద్రం ఏపీకి చేసిన అన్యాయాన్ని పార్టీలకు వివరించడానికి అవసరమైన సమగ్ర వివరాలతో నిక్షిప్తమయి ఉన్న పుస్తకాలను బాబు తయారు చేయించారు. దానికి సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లను కూడా సిద్ధం చేశారు. వాటితో పాటు ఎంపీలకు అందజేయడానికి ఒక హ్యాండ్ బుక్ ని కూడా సిద్ధం చేయించారని తెలుస్తోంది. విభజన వల్ల ఏపీకి కలిగిన నష్టం, దాని భర్తీకి కేంద్రం విభజన చట్టంలో ఇచ్చిన హామీలు ఇవే కాకుండా పార్లమెంట్ వేదికగా ఏపీకి ఇచ్చిన వాగ్దానాలు… అవి అమలైన తీరుతోపాటు పూర్తి సమాచారాన్ని ఇందులో పొందుపర్చారు.
టీడీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసుకు మద్దతు తెలిపిన పార్టీల నాయకులు, ఆయా పార్టీల ఎంపీలను కలిసి వారికి కృతజ్ఞతలు చెబుతూ మరిన్ని వివరాలు వారికి అందించాలన్నది సీఎం యోచనగా కనిపిస్తోంది. ఆయన ఢిల్లీలో వివిధ పార్టీల నాయకులను కలవడం, ఏపీకి జరిగిన అన్యాయం వివరించడంతో కేంద్రంపై ఒత్తిడి పెరుగుతుందని టీడీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
హస్తినలో రాజకీయాలు క్షణక్షణానికి మారిపోతున్నాయి. ఎన్డీయేకు టీడీపీ గుడ్‌బై చెప్పిన తర్వాత ఢిల్లీ రాజకీయాల్లో పూర్తిస్థాయి కదలిక వచ్చింది. బీజేపీకి వ్యతిరేకంగా పార్టీలన్నీ ఏకమవుతున్నాయి. ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన వెంటనే టీడీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానానికి గంటలోపే పదకొండు పార్టీలు మద్దతు ఇచ్చాయి. ఆ తర్వాత కాంగ్రెస్, సీపీఎం వారికి వారుగా అవిశ్వాస నోటీసులు ఇచ్చారు.
దీంతో ప్రతిపక్ష పార్టీలన్నీ మోదీకి వ్యతిరేకంగా కలిసి పోరాటానికి సిద్ధమయ్యాయని చెప్పాలి. ఎన్నికల నాటికి ఉండే పొత్తుల గురించి ఆలోచించకుండా ప్రస్తుతానికి అయితే కేంద్రాన్ని టార్గెట్ చేయడానికి ఏకమవుతున్నాయి. తిరుపతిలో ప్రత్యేకహోదా ఇస్తామన్న మోదీ హామీని, ఢిల్లీని మించేస్థాయిలో అమరావతిని నిర్మిస్తామని చెప్పిన హామీల వీడియోలను ప్రదర్శించి జాతీయ స్థాయిలో తన విధానానికి క్లారిటీ ఇచ్చారు.
ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కేంద్రంపై పోరాడటానికి వెనుకాడేదిలేదని చంద్రబాబు స్పష్టం చేశారు. తాను చెప్పే మాటలకు ఆధారాలతో సహా ఆయన ఢిల్లీకి పయనమవుతున్నారు. కేంద్రం ఇచ్చిన హామీలు, అమలు తీరును హస్తినలో తేల్చుకోనున్నారు. భవిష్యత్ పోరాటానికి సంబంధించి వ్యూహాత్మక అడుగులు వేయనున్నారు. అయితే ఇక్కడ మరో వ్యూహానికి చంద్రబాబు తెర తీసినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. అదేమిటంటే హస్తిన లో బాబు అద్వాని అపాయింట్మెంట్ కూడా కోరినట్టు తెలుస్తోంది.
అద్వానీ ని కూడా కలిసి ఇప్పటికే సిద్దం చేసిన పుస్తకాన్ని అలాగే సిద్దం చేయించిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అలాగే వీడియోలను ఆయన ముందు ఉంచనున్నారు అని తెలుస్తోంది. ఇదే గనుక జరిగితే ఇప్పటికే బీజేపీ మీద మోడీ-షా ఏక పక్ష వైఖరి తో విసుగెత్తి పోయి ఉన్న అద్వానీ ఇప్పటికే బీజేపి లో ఉన్న అసమ్మతి వర్గాన్ని ఏకం చేసి మోడీ మీద తిరుగుబాటు చేయించే అవకాసం లేక పోలేదు. అయితే ఈ విషయన్ని ముందే పసిగట్టిన బీజేపీ అనుబంధసంస్థ ఆరెస్సెస్ దీనికి అడ్డుకట్ట వేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.
ఈ ప్రయత్నం లో గనుక బాబు అద్వానీని ఒప్పించి బీజేపి అసమ్మతి వర్గాన్ని ఏకం చేయగలిగితే, అవిశ్వాస తీర్మానంలో బీజేపి కి అంటే పరోక్షంగా మోడీ-షా ద్వయానికి షాక్ తగలడం ఖాయం.