ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్పీడు పెంచేశారు. ఒకవైపు, రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపస్తూనే మరో వైపు పార్టీ కార్యక్రమాలపై దృష్టి సారించారు. వచ్చే ఎన్నికల్లోనూ గెలిచి, మరోసారి అధికారంలోకి రావాలనుకుంటున్న ఆయన అందుకోసం ప్రత్యేక వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే పార్టీ పరమైన, అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్న టీడీపీ అధినేత.. తాజాగా ఎన్నికల కోసం మరో అడుగు ముందుకేశారు. ఇందులో భాగంగానే టీడీపీ అనుబంధ విభాగాలకు అధ్యక్షులను ఖరారు చేశారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడుగా ఉన్న చంద్రబాబు అధికరికంగా తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా ఉన్న పది విభాగాలకు అధ్యక్షులను ఖరారు చేశారు. తెలుగు యువత అధ్యక్షుడిగా కృష్ణా జిల్లాకు చెందిన దేవినేని అవినాష్, తెలుగు మహిళ అధ్యక్షురాలిగా ప్రకాశం జిల్లాకు చెందిన పోతుల సునీత, తెలుగు రైతు అధ్యక్షుడిగా నెల్లూరు జిల్లాకు చెందిన కంభం విజయ రామిరెడ్డి, బీసీ సెల్ అధ్యక్షుడిగా గుంటూరు జిల్లాకు చెందిన బోనబోయిన శ్రీనివాస యాదవ్, ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా అనంతపురం జిల్లాకు చెందిన ఎంఎస్ రాజు, ఎస్టీ సెల్ అధ్యక్షుడిగా విశాఖపట్నం జిల్లాకు చెందిన ఎంవీవీ ప్రసాద్, మైనారిటీ సెల్ అధ్యక్షుడిగా కర్నూలు జిల్లాకు చెందిన ఇంతియాజ్ అహ్మద్, క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడిగా గుంటూరు జిల్లాకు చెందిన మద్దిరాల జోసెఫ్ ఇమ్మాన్యువల్, టీఎన్‌టీయూసీ అధ్యక్షుడిగా చిత్తూరు జిల్లాకు చెందిన బీ నరేష్ కుమార్ రెడ్డి, అంగన్ వాడి యూనియన్ అధ్యక్షురాలిగా గుంటూరు జిల్లాకు చెందిన భీమినేని వందనా దేవి పేర్లను ఖరారు చేశారు. వీరిలో ముగ్గురు అధ్యక్షులు గుంటూరు జిల్లాకు చెందిన వారు కావడం గమనార్హం.