సీబీఐలో గత కొన్ని రోజులుగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. వారం రోజుల కిందట సీబీఐ డైరెక్టర్ ఆలోక్ వర్మకు హైపవర్ కమిటీ ఉద్వాసన పలకి వేరే విభాగానికి బదిలీ చేశారు. తాజాగా స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానా పదవీ కాలాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం కుదించింది. అస్థానాతో పాటు జాయింట్ డైరెక్టర్ అరుణ్ కుమార్‌శర్మ, డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ మనీశ్‌కుమార్ సిన్హా, సూపరిటెండెంట్ ఆఫ్ పోలీస్ జయంత్ జె. నైక్నవరే పదవీ కాలాలను కుదిస్తున్నట్లు నిన్న ప్రకటించారు. ఈ నేపధ్యంలో ఆస్థానాను సీబీఐ నుంచి బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ విభాగానికి బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. తక్షణమే నిర్ణయం అమలులోకి వస్తుందని ఉత్తర్వులు జారీ చేసింది.
సీబీఐలో నెంబర్ 2గా కొనసాగిన రాకేష్ ఆస్థానాను సైతం సీబీఐ నుంచి బటయకు పంపడం ఇప్పుడు పలు చర్చలకు దారి తీస్తోంది. సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ, స్పెషల్ డైరెక్టర్ ఆస్థానాల మధ్య వివాదాలు చెలరేగడంతో పాటు వీరిపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో ఇద్దరిని బలవంతపు సెలవుపై పంపారు. అలోక్ వర్మను తప్పించి తెలుగు వ్యక్తి మన్నెం నాగేశ్వరరావుకు తాత్కాలిక డైరెక్టర్‌గా బాధ్యతలు అప్పగించారు. సుప్రీం కోర్టు ఆదేశాలతో వారం రోజుల కిందట అలోక్ వర్మకు మళ్లీ పగ్గాలిచ్చిన కేంద్ర ప్రభుత్వం రెండు రోజుల్లోనే ఆయనను సీబీఐ డైరెక్టర్ పదవి నుంచి తప్పించి డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫైర్ సర్వీసెస్, సివిల్ డిఫెన్స్ అండ్ హోమ్ గార్డ్స్‌కు బదిలీ చేశారు. తాను గతంలోనే ఉన్నత హోదాలో పనిచేశానని, తక్కువ స్థాయి ఉద్యోగం చేయనని అలోక్ వర్మ ప్రకటించి పదవికి రాజీనామా చేశారు.