Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఆంధ్రప్రదేశ్ లో కొలువై భక్తులకి కొంగుబంగారంగా విలసిల్లుతూ కలియుగ వైకుంటంగా భారత దేశంలోనే కాక ఆసియా ఖండంలోనే అతి పెద్ద పుణ్యక్షేత్రాలలో ఒకటయిన తిరుమల మీద కేంద్రం కన్ను పడింది. ఇప్పటి వరకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అజమాయిషీతో నడుస్తున్న టీటీడీని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నుండి వేరు చేసే కుట్ర కేంద్రంలో ఉన్న బీజేపీ చేసిందా అనే అనుమానాలు కలిగేలా టీటీడీ ఈవో సింఘాల్ కి ఒక ఉత్తర్వు జారీ చేసింది. కలియుగ ప్రత్యక్ష దైవం మీద ఏపీ ప్రభుత్వానికి హక్కులు లేకుండా చేయాలని ఇప్పటి వరకు స్వతంత్ర ట్రస్ట్ గా ఉన్న టీటీడీ నుండి దేవాలయాన్ని తప్పిస్తూ కేంద్ర పురావస్తు శాఖకి తిరుమల దేవాలయాన్ని దాని ఉప దేవాలయాలని అప్పగించేలా చూడాలని ఆ ఉత్తర్వులలో పేర్కొంది.
ఈ చర్యతో టీటీడీ పరిధిలో తిరుమలలో ఉన్న అన్ని ఆలయాలను తన పరిదిలోకి తీసుకునేందుకు కేంద్ర ప్రయత్నాలు మొదలుపెట్టిందని చెప్పక తెప్పదు. తిరుమలని రక్షిత కట్టడాల పరిధిలో చేర్చేందుకు ఆయా దేవాలయాలను సందర్శించి ఫొటోలు తీసుకునేందుకు… కేంద్ర పురావస్తు శాఖ అధికారులకు సహకరించాలని తస్త్ర ప్రభుత్వ పురావస్తు శాఖకి కేంద్రం లేఖ పంపింది. ఇదే జరిగి నిజంగానే రక్షిత కట్టడాలుగా ప్రకటిస్తే కేంద్రం చేతిలోకి టీటీడీ వెళ్లే అవకాశం ఉంది. కేంద్ర పురావస్తు శాఖ డైరెక్టరేట్ నుంచి… విజయవాడలోని అమరావతి సర్కిల్‌కు ఆదేశాలు అందాయి. కేంద్ర ఆదేశాల మేరకు టీటీడీకి అమరావతి సర్కిల్ లేఖ పంపింది. తిరుమలలో పురాతన కట్టడాలకు రక్షణ కరువైందని, పురాతన కట్టడాలు తొలగించి కొత్త నిర్మాణాలు చేపడుతున్నారని పలు ఫిర్యాదులు వచ్చినట్లు కేంద్ర పురావస్తు శాఖ చెబుతోంది.
భక్తులు ఇచ్చిన కానుకలు సరిగా భద్రపరచడం లేదనే ఫిర్యాదుల వస్తున్నాయట. పూర్వకాలంలో రాజులు ఇచ్చిన ఆభరణాలు భద్రతకు నోచుకోలేదని ఆరోపిస్తూ తమ అధీనంలోకి తీసుకునేందుకు కేంద్ర పురావస్తు శాఖ ప్రయత్నించింది. తిరుమలలోని ఆలయాలను కేంద్ర పురావస్తు శాఖ స్వాధీనం చేసుకుంటే ఏపీ ప్రభుత్వానికి ఎలాంటి అధికారం ఉండదు. ఆలయాలకు వచ్చే ఆదాయాన్ని కేంద్రం తీసుకునే అవకాశం ఉంది. టీటీడీ బోర్డు మెంబర్లను నామినేట్ చేసే అధికారం కూడా రాష్ట్రానికి లేకుండా పోతుంది. అంటే టీటీడీ మొత్తం కేంద్ర చేతుల్లోకి పోతుంది. అయితే ఈ ఉత్తర్వులు జారీ చేసిన కొద్దిసేపటికే మరలా వాటిని వెనకి తీసుకుంటున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఎందుకంటే ఈవో సింఘాల్ కేంద్రానికి గట్టి రిప్లై పంపారని టీటీడీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ విషయం బయటకి రావడంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుందని అదీ కాక త్వరలో కర్నాటక ఎన్నికలు ఉండటం తో ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్టు చెబుతున్నారు. ఏది ఏమైనా మోడీ కుట్రలు దేవుడి మీద కూడా వదలడం లేదని నెటిజన్లు మోడీని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఏపీ మీద కుట్ర చేసేందుకు సిద్దమయిన మోడీ ఇంకెన్ని రకాలుగా కుట్రలు పన్నుతాడో అని నెటిజన్లు మోడీని ట్రోల్ చేస్తున్నారు.