Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తనకు అనుకూలంగా లేనివారిపై ప్రధాని ఏదో ఓ రూపంలో కక్ష తీర్చుకుంటూ ఉంటారు. నాలుగేళ్ల పాలనాకాలంలో ఎన్నోమార్లు ఈ విషయం రుజువయింది. ఈ క్రమంలోనే తన తాజా ప్రత్యర్థి చంద్రబాబును ఏదో ఒక రకంగా ఇరుకునపెట్టేందుకు ప్రధాని నిరంతరం ప్రయత్నాలు జరుపుతూనే ఉన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం నుంచి టీడీపీ బయటకువచ్చిన దగ్గరనుంచి…ఏపీ ప్రభుత్వంపై కేంద్రం కుయోక్తులు పన్నుతోంటే..ఎప్పటికప్పుడు చంద్రబాబు సమర్థవంతంగా వాటిని తిప్పికొడుతున్నారు. టీటీడీ పదవుల నియామకంలో కూడా ఇదే జరిగింది. తాము కోరుకున్న వ్యక్తిని టీటీడీ చైర్మన్ గా నియమించాలని బీజేపీ చంద్రబాబుపై ఒత్తిడి పెంచింది. కానీ చంద్రబాబు ఆ ఒత్తిళ్లకు తలొగ్గలేదు.
దీంతో చైర్మన్ పుట్టాసుధాకర్ యాదవ్ పై బీజేపీ మాతృసంస్థలు ఆరెస్సెస్, వీహెచ్ పీ ఆరోపణలకు దిగాయి. ఆయన క్రిస్టియన్ అని ప్రచారం చేశాయి. పుట్టా నియామకాన్ని వ్యతిరేకిస్తూ..ఆందోళనలు కూడా నిర్వహించాయి. అయినప్పటికీ చంద్రబాబు లక్ష్యపెట్టకపోవడంతో…కేం ద్రప్రభుత్వం ఓ కొత్త కుట్రకు తెరలేపింది. టీటీడీ పరిధిలో తిరుమలలో ఉన్న అన్ని ఆలయాలను తన పరిధిలోకి తీసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఆలయాన్నింటినీ రక్షిత కట్టడాల పరిధిలోకి తెచ్చి తద్వారా…కేంద్ర పురావాస్తుశాఖ అజమాయిషీలోకి తీసుకువచ్చేందుకు పావులుకదుపుతోంది. ఇదే జరిగితే… టీటీడీ కేంద్రం చేతుల్లోకి వెళ్తుంది. తిరుమలలోని ఆలయాలన్నింటినీ సందర్శించి ఫొటోలు తీసుకునేందుకు కేంద్ర పురావస్తు శాఖ అధికారులకు సహకరించాలని రాష్ట్రానికి కేంద్రం లేఖ పంపింది. ఈ మేరకు కేంద్ర పురావస్తు శాఖ డైరెక్టరేట్ నుంచి విజయవాడలోని అమరావతి సర్కిల్ కు ఆదేశాలు అందాయి. కేంద్రం ఆదేశాల ప్రకారం అమరావతి సర్కిల్ టీటీడీకి లేఖపంపింది.
తిరుమలలో పురాతన కట్టడాలకు రక్షణ కరువైందని, పురాతన కట్టడాలు తొలగించి కొత్త నిర్మాణాలు చేపడుతున్నారని, పలు ఫిర్యాదులు ఇచ్చారని కేంద్ర పురావస్తుశాఖ చెబుతోంది. అలాగే భక్తులు ఇచ్చిన కానుకలు సరిగా భద్రపరచడం లేదని, పూర్వకాలంలో రాజులు ఇచ్చిన ఆభరణాలు కూడా భద్రతకు నోచుకోలేదని ఫిర్యాదులు అందాయని తెలిపింది. త్వరలోనే కేంద్ర పురావస్తు శాఖ అధికారులు ఆలయాన్ని సందర్శించి నివేదిక ఇవ్వనున్నారు. ఆ తర్వాత కేంద్ర అధికారులు తిరుమలను సందర్శిస్తారు.
అనంతరం కేంద్రం తుదినిర్ణయం తీసుకుంటుంది. టీటీడీనీ రాష్ట్రప్రభుత్వ పరిధినుంచి తప్పించేందుకు కేంద్రం చేపట్టిన ఈ ప్రక్రియ అనుకున్నది..అనుకున్నట్టుగా ముగిస్తే…టీటీడీ మొత్తం కేంద్రం పరిధిలోకి వెళ్లిపోతుంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఇక ఎలాంటి అధికారం ఉండదు. తిరుమల ఆదాయం మొత్తం కేంద్ర ఖజానాకు చేరుతుంది. టీటీడీ చైర్మన్ సహా బోర్డు మెంబర్ల నియామకాలన్నీ కూడా కేంద్రం అజమాయిషీలోనే సాగుతాయి….ఇదే జరిగితే…ఏపీకి, కేంద్రానికి మధ్య పెద్ద యుద్ధమే జరిగే ప్రమాదముంది. రాష్ట్ర,దేశ రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటుచేసుకునే అవకాశముంది..