ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయాలు, సంస్కృతికి అద్దంపట్టేలా విశాఖ ఉత్సవ్ పేరుతో ప్రతి ఏటా ఏపీ ప్రభుత్వం వేడుకలను నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఈ ఏడాది కూడా విశాఖ ఉత్సవాలు నేటి నుండి ప్రారంభంకానున్నాయి. ఈ ఉత్సవాలను అంగరంగా వైభవంగా నిర్వహించేందుకు పర్యటక శాఖ భారీ ఏర్పాట్లను చేసింది. వాస్తవానికి సాయంత్రం సీఎం చంద్రబాబు ముఖ్యఅతిథిగా హాజరై ఉత్సవ్‌ను ప్రారంభిస్తారు. అలాగే వేడుకల్లో భాగంగా సెంట్రల్ పార్క్‌లో భారీ పుష్ప ప్రదర్శన నిర్వహిస్తున్నారు. ఇందుకోసం బెంగళూరు, కడియం సహా వివిధ ప్రాంతాల నుంచి పూల మొక్కలను తీసుకొచ్చారు. అలాగే సంగీత, సాంస్కృతిక, జానపద కళారూపాల నిర్వహణ, ప్రదర్శన కోసం బీచ్‌రోడ్డులో రెండు ప్రధాన వేదికలను ఏర్పాటుచేశారు.
అలాగే చిన్నారుల కోసం అమ్యూజ్మెంట్ జోన్ కూడా ఏర్పాటు చేశారు. అయితే తాజాగావిశాఖ ఉత్సవ్‌లో నిర్వహించే ఎయిర్‌షోను రద్దుచేయడం చర్చనీయాంశంగా మారింది. ఏపీపై కక్షపూరిత చర్యలతోనే ఈ ఎయిర్‌షోను అర్దాంతరంగా రద్దుచేశారనే విమర్శలు వస్తున్నాయి. ఎయిర్‌షో గురించి వైమానిక దళానికి చెందిన 90 మంది సభ్యులు వచ్చి రిహార్సిల్ నిర్వహించిన తర్వాత కూడా దీన్ని రద్దుచేశారని ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. ముందుగానే ఒప్పందం చేసుకున్నా, హఠాత్తుగా ఇలా రద్దుచేసుకోవడం వెనుక కేంద్రం ఉందని ఆయన ఆరోపించారు. అయితే యధావిధిగా సీఎం చంద్రబాబు ఉత్సవ్‌ను ప్రారంభిస్తారు.