చంద్రబాబుకీ తెలుగుదేశానికీ సంబంధం లేదా…అయ్యో…!

Chadalawada Krishnamurthy Comments On TDP

మడిసన్నాక కూసింత కళాపోషణ ఉండాలబ్బా అని అదేదో సినిమాలో రావు గోపాల రావు అన్నట్టు నేటి రాజకీయ నేతలు కూడా ఇప్పడు మాటలు భలేగా అల్లే నేర్పరితనం నేర్చుకుంటున్నారు. అందుకు తాజా ఉదాహరణ మాజీ టీడీపీ నేత‌, టీటీడీ చైర్మన్ ప్ర‌స్తుతం జ‌న‌సేన‌లో చేరిన చ‌ద‌ల‌వాడ కృష్ణ‌మూర్తికి వ‌చ్చింది. నిజానికి చ‌ద‌ల‌వాడ‌కు తెలుగుదేశంలో ద‌క్కాల్సినంత గౌర‌వం ద‌క్కింది. ఎందుకంటే ఎవ‌రైనా టీటీడీ ఛైర్మ‌న్ అయ్యారంటే వారిని చంద్ర‌బాబు అంద‌రికంటే ఎక్కువగా గుర్తించిన‌ట్టు. బాబు ప్రీతిపాత్రుడుగా పేరొచ్చింది కాబ‌ట్టి చ‌ద‌ల‌వాడ కృష్ణ‌మూర్తికి ఆ ప‌ద‌విని ఇచ్చారు. అయితే, ఆయనేమో పదవీ కాలం అనుభవించాక ఇప్పుడు మళ్ళీ తిరుపతి టికెట్ అడిగారు. అయితే ఇప్పటికే అకడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సుగుణమ్మను కాదని టికెట్ ఇచ్చేందుకు బాబు ఒప్పుకోలేదు. వైసీపీ వంకా చూశారు అక్కడ భూమన కనపడడంతో ఇక కొత్తగా పుట్టుకొచ్చి తన సామాజిక వర్గం వారికే పెద్ద పీట వేస్తున్న జనసేన కనపడేప్పటికి ఎక్కడో శ్రీకాకుళంలో తుఫాను వచ్చి అందరూ నానా ఇబ్బందులలో ఉన్న సమయాన అక్కడికి వెళ్లి మరీ బాణాలు ఎక్కుపెట్టించి మరీ ఆ పార్టీ కండువా కప్పేసుకున్నారు.

janasena

అయితే జ‌న‌సేన‌లో చేరాక చదలవాడ చంద్ర‌బాబుపై చేసిన కామెంట్స్ ఇపుడు ఆయన పదవీ దాహాన్ని బహిర్గతం చేస్తున్నాయి. ఆయ‌న ప్రకారం తాను టిక్కెట్ కోసం జ‌న‌సేన‌లో చేర‌లేదనీ, టీటీడీ బోర్డు మెంబర్ కావాలని కోరుకుంటే వెంకన్న దయతో బోర్డు ఛైర్మన్ అయ్యానని అన్నారు. అలాగే తన జీవితంలో ఎన్నడూ స్వార్థం కోసం చూసుకోలేదని చిన్న తప్పు కూడా చేయలేదని అంతేకాక టీడీపీకి వన్నె తెచ్చానని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబును జీవితాంతం మర్చిపోనని, ఎందుకంటే ఆయ‌న తనకెంతో చేశారని ఆయన చెప్పుకొచ్చారు. అదే సమయంలో మరో పరస్పర విరుద్ద కామెంట్ కూడా చేశారు అదేంటంటే తెలుగుదేశం పార్టీ తనను ఒక్కరోజు కూడా గుర్తించలేదట. అందుకే విసిగిపోయి పార్టీ మారాను అని ఆయన చెప్పుకొచ్చారు. అంటే తెలుగు దేశం వేరు, చంద్రబాబు వేరు కాబోలు.

cm