Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నంది అవార్డుల ఎంపికలో కొందరికి అన్యాయం జరిగిందని వస్తున్న విమర్శల మీద ఏ పెద్ద హీరో గొంతు ఎత్తలేదు. అయితే ఆ హీరోలకు జరిగిన అన్యాయం మన ఇంటి మనిషికి జరిగినంతగా బాధపడిపోతున్నారు ఆ హీరోల అభిమానులు. ఇక అవార్డుల పేరుతో తమ హీరోను తప్పుబడుతున్న వారిని తూర్పారబడుతున్నారు మరికొందరు అభిమానులు. వెండితెర మీద వినోదం పంచే హీరోలు ఇప్పుడు ఈ వినోదం చూస్తూ నిలబడ్డారు. ఇదే కాదు తమ సినిమా తప్ప వేరే సామాజిక అంశాల పట్ల కూడా మెజారిటీ హీరోలది ఇదే ధోరణి. జల్లికట్టు లాంటి ఓ సంప్రదాయాన్ని కాపాడేందుకు తమిళ సినీ పరిశ్రమ మొత్తం దిగి వస్తే ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక హోదా వంటి సీరియస్ అంశాల్లోనూ నోరెత్తిన హీరో లేడు. అలాగని అన్ని విషయాల్లో మౌనంగా వుంటారా అంటే అదీ లేదు. ఏ నాయకుడిని అయినా పొగడాల్సివస్తే వంతులు వేసుకుని, పోటీలు పడి మరీ ముందుకు వస్తారు. ఈ హీరోల నిర్లిప్తతని ప్రశ్నిస్తూ ఏపీ మేధావుల సంఘం నేత చలసాని శ్రీనివాస్ రాసిన లేఖ మీ కోసం …
మహేష్ బాబు, బాలకృష్ణ చిరంజీవి గార్లు ఒకరా ఇద్దరా… పెద్దపెద్ద కళాకారులు, నిపుణులు, హేమాహేమీలు… ఒక్కరూ ఆంధ్రా హక్కులు ఆత్మగౌరవం గురించి మాట్లాడరు ఎందుకనో! మిత్రులారా సాంఘిక మాధ్యమంలో గట్టిగా ప్రశ్నించండి.
తమిళనాట తెలుగువారు రాధిక నాయుడు, విశాల్ రెడ్డి, కెప్టెన్ విజయకాంత్ నాయుడు, భాగ్యరాజా నాయుడు, అలాగే తెలుగునాట పుట్టిన అజిత్ శర్మ లేదా శివాజీరావ్ గైక్వాడ్ అలియాస్ రజనీకాంత్.. ఎవరైనా అక్కడ తమిళప్రాంతం కోసం ప్రాణం పెడతారే. మరేమిటి ఇక్కడ మనవారు వందల, వేలకోట్లు కోస్తా, రాయలసీమ వారు వారికి సమర్పించుకొన్నా ఆంధ్రా హక్కులకోసం కిమ్మనరేమిటి? ఒకప్పుడు సమైక్యాంధ్ర కోసం అనలేరు తెలంగాణ ప్రేక్షకులలో కూడా అభిమానులుంటారుగా అని సరిపెట్టుకున్నాం. ఇప్పుడు తెలంగాణా వారే మాకు రాష్ట్రం వచ్చింది, ఆంధ్రావారికి హోదా, హామీలు ఇవ్వమనండి పాపం అంటున్నారు. మరి మీకేమయ్యింది. గౌ.కచశేరా గారు పిలవకుండానే పొర్లు దండాలు పెడతారు. తప్పులేదు… మీ ఇష్టం. పవన్ గారు రెండు మీటింగులలో చాలా గట్టిగా మాట్లాడారు. శివాజీ గారు ఏకంగా దీక్షచేశారు, అప్పుడప్పుడు అయినా నిబద్ధతతో పాల్గొన్నారు. కీ.శే దాసరి నారాయణరావు గారు సంఘీభావం ప్రకటించారు. ప్రకాష్ రాజ్, భరద్వాజ, సంపూర్ణేష్ బాబు గారిలాంటి కొద్దిమంది మాత్రం గొంతెత్తారు. ధన్యువాదాలు. కానీ మేము ఎలుగెత్తి పిలిచినా, 44 నెలల మా ఆమరణ దీక్షల, ఉద్యమ సమయంలో చిత్ర సీమలో మహామహులు అని చెప్పుకుంటున్న మిగిలిన 99.99% చూపించిన నిర్లిప్తత మా ప్రజలను తీవ్రంగా బాధించింది. దయచేసి పెద్దలారా ఆలోచించండి… మారండి. ప్రజలందరికీ ఈ విషయం తెలవాలి. గుండెలు మండుతున్నాయి…-చలసాని