తెలంగాణలో ఏడు వేల చదరపు కిలోమీటర్ల అటవీ ప్రాంతానికి అగ్నిప్రమాదాల ముప్పు ఎక్కువగా ఉన్నట్టు కేంద్రం హెచ్చరించింది. అక్కడక్కడా మరికొన్నిచోట్ల కూడా అడవులకు నిప్పంటుకునే అవకాశం ఉందని తెలిపింది. తాజాగా విడుదల చేసిన ‘ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ (ఐఎస్ఎఫ్ఆర్)’లో ఈ వివరాలను వెల్లడించింది. కొన్నిచోట్ల అడవులకు అతిఎక్కువ ప్రమాదం ఉందని పేర్కొంది. రాష్ట్రంలో దట్టమైన అటవీ ప్రాంతమున్న ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, మహబూబ్నగర్ జిల్లాల పరిధిలోనే ఈ ప్రాంతాలు ఉన్నట్టు తెలిపింది.
2018 నవంబర్ నుంచి 2019 జూన్ మధ్యకాలంలో.. తెలంగాణకు సంబంధించి మోడీస్ ద్వారా 1,246, ఎస్ఎన్నపీపీ–వీఐఆర్ఎస్ ద్వారా 15,262 అగ్ని ప్రమాద హెచ్చరికలు వచ్చాయని వెల్లడించింది.మనదేశంలో ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా విభాగం ఉపగ్రహాల ద్వారా అడవుల్లో అగ్ని ప్రమాదాలను పరిశీలిస్తోంది. ‘ఫారెస్ట్ ఫైర్ అలర్ట్ సిస్టమ్’ ద్వారా నిప్పు అంటుకున్న, అగ్ని ప్రమాదం జరిగే అవకాశమున్న ప్రాంతాలను గుర్తించి తగిన చర్యలు చేపడుతోంది. ఎక్కడ ప్రమాదం జరిగినా.. ఆ ప్రాంతంలోని సంబంధిత అధికారులు, గ్రామ కార్యదర్శులకు సమాచారం వెళ్లేలా ఏర్పాటు ఉంది.
మోడీస్, ఎస్ఎన్నపీపీ–వీఐఆర్ఎస్ శాటిలైట్ డేటా ద్వారా ఈ హెచ్చరికలను పంపుతుంటారు.తెలంగాణలోని 43 అటవీ రేంజ్లలో మొత్తం 9,771 కంపార్ట్మెంట్లకు గాను 1,106 ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలకు ఆస్కారమున్నట్టు గతంలోనే గుర్తించారు. ఆయా చోట్ల కనీసం ఐదుగురు సిబ్బంది, ప్రత్యేక వాహనం, నిప్పును ఆర్పే బ్లోయర్ పరికరాలతో క్విక్ రెస్పాన్స్ టీమ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అన్ని కంపార్ట్మెంట్లలో ఫైర్ లైన్లను ఏర్పాటు చేసి, ప్రమాద నివారణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.
సాధారణంగా ఫిబ్రవరి నుంచి మేదాకా అడవుల్లో అగ్ని ప్రమాదాలకు అవకాశాలు ఎక్కువ. అటవీ మార్గాల్లో మంటలు పెట్టకుండా, వంట చేయకుండా.. కాలుతున్న సిగరెట్, బీడీల లాంటివి పడేయకుండా అవగాహన కల్పించాల్సి ఉంటుంది. ఈ మేరకు తక్షణమే చర్యలు చేపడితే మంచిదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అటవీ ప్రాంతాల్లో అక్కడక్కడా చిన్నస్థాయిలో నిప్పు అంటుకోవడం సాధారణమేనని.. కానీ నియంత్రించలేని స్థాయికి చేరి కార్చిచ్చులుగా మారితే.. తీవ్ర నష్టం తప్పదని హెచ్చరిస్తున్నారు.