ఏపీలో లో తెలుగుదేశం పార్టీ ఉనికి కోల్పోతున్న సమయంలో రాజధాని వ్యవహారం ఆ పార్టీకి కాస్త ఊపిరి పోసింది. జగన్ మూడు రాజధానులు ప్రకటన చేయగానే చంద్రబాబు ఆవేశంగా ఆ ప్రాంత ప్రజల కంటే ఎక్కువగా రియాక్ట్ అయ్యారు. అమరావతిని రాజధానిగా ఉంచుతూనే మరో రెండు చోట్ల అభివృద్ధి చేస్తామని చెప్పిన దానిని వక్రీకరించి ఈ ప్రాంత ప్రజలకు తీరని అన్యాయం జరిగిపోతుంది అన్నట్టుగా చంద్రబాబు ఆ ప్రాంత ప్రజలకు నూరిపోశారు. 20 రోజులుగా సాగుతున్న ఉద్యమంలో తెలుగుదేశం పార్టీ బాగానే పుంజుకుంది. దీనికి అనుకూల మీడియా మరింత ప్రచారం కల్పించడంతో తెలుగుదేశం పార్టీ బాగా పాపులర్ అయింది. అయినా చంద్రబాబు ఏదో తెలియని బాధ వెంటాడుతూనే ఉంది.
వైసీపీ ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి తన బలం సరిపోదు అని ముందుగానే గ్రహించిన చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మద్దతు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. అయితే కొద్ది రోజుల పాటు ఈ ఉద్యమంలో పవన్ విడిగా పాల్గొన్నా ఆ తర్వాత దూరమయ్యారు. ప్రస్తుతం ఆయన బీజేపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారనే వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో ఏదో ఒక రకంగా పవన్ ను దగ్గర చేసుకుని అమరావతి ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఉద్యమంలోకి పవన్ కూడా తీసుకురావాలని, ఆ పార్టీ రాకతో తమ బలం పెంచుకోవాలని బాబు చూస్తున్నారు. దానిలో భాగంగానే అనంతపురం సభలో మాట్లాడిన చంద్రబాబు పవన్ పోరాటాలు చేసి పైకి వచ్చిన వ్యక్తి అంటూ పొగడ్తల వర్షం కురిపించారు.
వైసీపీ పై ఆయన తీవ్ర స్థాయిలో పోరాటం చేశారు అన్నట్టుగా బాబు మాట్లాడారు. ప్రస్తుతం పవన్ అమరావతి రైతుల కోసం పాదయాత్ర చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఈ యాత్రను పవన్ ఒక్కడే కాకుండా, తెలుగుదేశం పార్టీతో కలిసి చేసేలా పవన్ ను ఒప్పించే ప్రయత్నాలు బాబు చేస్తున్నారు. పవన్ ఇమేజ్ కు టీడీపీ కూడా జత కలిస్తే మరింతగా ఉద్యమానికి ఊపు వస్తుందని బాబు పవన్ కు చెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా వచ్చే క్రెడిట్ మొత్తాన్ని తెలుగుదేశం ఖాతాలో వేసేందుకు బాబు తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే బాబు తో కలిసి పవన్ పోరాటం చేస్తాడా లేక జనసేన క్రెడిట్ పెరిగేలా సొంతంగా చేసుకుంటాడా అనేది చూడాలి.