Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
లోక్ సభలో టీడీపీ ఎంపీల ఆందోళనలు ఐదోరోజూ కొనసాగుతున్నాయి. ఉదయం పదకొండు గంటలకు సభ ప్రారంభం కాగానే ఎంపీలు ఆందోళన ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ కు న్యాయం చేయాలని కోరుతూ టీడీపీ సభ్యులు వెల్ లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. టీడీపీ ఎంపీలకు మద్దతుగా కొందరు కాంగ్రెస్ ఎంపీలు తమ స్థానాల్లో లేచి నిలబడి నినాదాలుచేస్తుండడంతో సభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. దీంతో ప్రశ్నోత్నరాలను కొనసాగించే పరిస్థితి లేదని భావించిన స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను వాయిదావేస్తున్నట్టు ప్రకటించారు. అనంతరం టీడీపీ సభ్యులు పార్లమెంట్ వెలుపలకు వచ్చి ప్లకార్డులు పట్టుకుని నిరసనలు తెలియజేశారు. అటు తొలివిడత సమావేశాల చివరిరోజైన ఇవాళ ఉభయసభల్లో పోరు తీవ్రం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంపీలకు సూచించారు.
సస్పెండైనా పర్వాలేదని, ఇదేతీరులో నిరసనలు కొనసాగించాలని ఆయన ఆదేశించారు. సస్పెండ్ చేస్తే పార్లమెంట్ బయట ఆందోళన కొనసాగించాలని కోరారు. అధికారంలో ఉన్న బీజేపీ వైఖరి జాతీయపార్టీ తరహాలో లేదని, అందరినీ కలుపుకుని పోవడం లేదని ముఖ్యమంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. అరుణ్ జైట్లీ ప్రసంగంలో కూడా ఏపీ హామీలపై స్పష్టమైన ప్రకటన చేయకపోవడాన్ని ముఖ్యమంత్రి తప్పుబట్టారు. కేంద్రం నుంచి సానుకూల స్పందన ఏదైనా వస్తుందేమో ఈ సాయంత్రం వరకు వేచిచూద్దామని చెప్పారు. ఎంపీలతో అమరావతిలో సమావేశం నిర్వహిస్తానని, తదుపరి విషయాలు అక్కడ చర్చించుకుందామని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు. వచ్చే నెల 5 నుంచి జరగనున్న బడ్జెట్ మలివిడత సమావేశాల్లోపు నిర్దిష్ట కార్యాచరణ రూపొందించుకుందామని తెలిపారు.