Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కన్నతల్లి, జన్మభూమి… ఏ మనిషికి అయినా ప్రపంచాన్ని చూపే రెండు కళ్ళు. ఆ కళ్ళే మన జీవన పోరాటంలో పరుగులు తీసే కాళ్ళకి దారి చూపిస్తాయి. ఆ పోరాటంలో ఓడిపోతే ఓదార్పునిస్తాయి. అలిసిపోతే సేద తీరుస్తాయి. గెలిచి వస్తే పండగ చేసుకుంటాయి. మన జీవితం ఎలా వుందో మనం చేసుకోవాలంటే ఆ కళ్ళలోకి చూస్తే చాలు. మన మెరుపులు, విరుపులు అన్నీ ఆ కళ్ళలో ప్రతిబింబిస్తాయి. కానీ ఆ కళ్ళలో తడి తగ్గితే, అవే పొడిబారితే మనం వెలిగిపోతున్నా అవి చూడలేక ఆ కళ్ళలో చీకట్లు ముసురుకుంటాయి. ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే ఏమి చేయాలి. మనకి ప్రపంచాన్ని పరిచయం చేసిన ఆ కళ్ళకి మనమే వెలుగుఇవ్వాలి. ఆ వెలుగుల్లో జన్మభూమి మెరిసిపోవాలి. ఆ మెరుపుల్లో మన అభివృద్ధి మాత్రమే కాదు… సాటి మనిషికి దారి కనిపించాలి. ఆ జన్మభూమిలో పుట్టిన ప్రతి బిడ్డ గమ్యం చేరేదాకా ఆ వెలుగులు విరజిమ్ముతూనే ఉండాలి. అప్పుడు కదా ఆ జన్మభూమి హాయిగా నవ్వేది.ఆ నవ్వుల్లో మనని మనం మైమరిచిపోయేది.
జన్మభూమిని అలా ఆనందంగా చూడాలనే లక్ష్యం తోటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబు నాయుడు గారు ఓ అరుదైన ఆలోచన చేశారు. మనకి ఎంతో ఇచ్చిన జన్మభూమికి కొంతైనా ఇద్దాం అన్న ఆలోచనతో ప్రవాసాంధ్రుల్ని కదిలించేందుకు పూనుకున్నారు. మొక్కగా ఉన్న ఈ ఆలోచనని మానులా పెంచే బాధ్యతలో రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉత్తర అమెరికా ప్రత్యేక ప్రతినిధిగా కోమటి జయరాం ని నియమించారు. అమెరికాలో దాదాపుగా 4 లక్షల తెలుగు కుటుంబాలు జన్మభూమి ఋణం తీర్చుకునే దిశగా చంద్రబాబు స్ఫూర్తి తో జయరాం ప్రయత్నాలు ప్రారంభించారు.
తొలిదశలో స్మశాన వాటికల అభివృద్ధి, అంగన్ వాడీ భవన నిర్మాణాలు, స్కూల్స్ అభివృద్ధి, పాఠశాలల్లో డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు మీద ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు ప్రవాస ఆంధ్రులు దృష్ఠి పెట్టారు. రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, విద్యాశాఖ ఈ మహా యజ్ఞం లో పాలుపంచుకుంటున్నాయి. చేసే ప్రతి పనిలో 30 శాతం నిధులు ప్రవాస ఆంధ్రులు, సమకూరిస్తే సంబంధిత ప్రభుత్వ శాఖలు మిగిలిన 70 శాతం నిధులు ఇస్తున్నాయి. ఈ మహత్కార్యంలో భాగస్వాములు అయ్యే ప్రవాస ఆంధ్రుల కోసం ప్రత్యేకంగా “ఆంధ్రప్రదేశ్ జన్మభూమి ” అనే వెబ్ సైట్ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం కోసం విరాళాలు ఇచ్చే ప్రవాస ఆంధ్రులకి పన్ను రాయితీ సహా వివిధ సౌలభ్యాలు కల్పిస్తోంది ఏపీ సర్కార్.సీఎం చంద్రబాబు స్ఫూర్తి తో ఈ బాధ్యత మోస్తున్న కోమటి జయరాం ఆధ్వర్యంలో ఎన్నో పనులు జరిగాయి. తాజాగా ఆయన ఆంధ్రప్రదేశ్ వచ్చిన సందర్భంగా ప్రవాస ఆంధ్రుల సహాయంతో మొదలైన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ప్రవాస ఆంధ్రుల సహకారంతో భవిష్యత్ లో మరింత దూకుడుగా ఈ కార్యక్రమాల్ని నిర్వహించడానికి సమాయత్తమవుతున్నారు. ఇప్పటిదాకా ఈ కార్యక్రమం ద్వారా జరిగిన వివిధ అభివృద్ధి పనుల చిత్ర మాలిక మీ కోసం.
కన్నతల్లి, జన్మభూమి తో మనకున్న బంధం, అనుబంధం వెలకట్టలేనివి. ఎంత చేసినా తీర్చుకోలేనివి. అంతమాత్రాన ఆ బంధం,అనుబంధంలోని మాధుర్యాన్ని అనుభవించడానికి మాత్రమే పరిమితం అయితే దానికి బీటలు రావడం ఖాయం. బంధం, అనుబంధం నిలవాలంటే అవసరమైన బాధ్యతలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. జన్మభూమి కలల్లో పుట్టి పెరిగిన వారికి ఆ బాధ్యత గుర్తు చేయాల్సిన అవసరం కూడా ఉండదు. కానీ ఈ పోటీ ప్రపంచంలో పరుగులు తీస్తున్నవారికి ఆ బంధం వెనుక బాధ్యతని గుర్తు చేయడానికి ఏపీ సర్కార్ చేస్తున్న ప్రయత్నానికి మీ వంతు సహాయసహకారాలు అందిస్తారని ఆశిస్తూ, ఈ పవిత్ర కార్యంలో భాగస్వామిని చేసిన సీఎం చంద్రబాబు గారికి శతసహస్ర వందనాలతో …
మీ కోమటి జయరాం.
మరిన్ని వార్తలు: