Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ప్రధాని మోడీ ప్రభంజనం ముందు కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ తేలిపోతున్న సమయంలో బీహార్ లో బీజేపీ దూకుడుకు అడ్డం పడిన నితీష్ కుమార్ లో అందరికీ హీరో కనిపించాడు. మోడీ కి ఎప్పుడైనా నితీష్ ప్రత్యామ్న్యాయం అనుకుంది దేశమంతా. రాజకీయ బద్ధ శత్రువు లాలూతో కలిసి బీహార్ లో బీజేపీ దూకుడుకు కళ్లెం వేసిన నితీష్ లో భావి ప్రధానిని చూసిన వాళ్ళు వున్నారు. అందుకే బీజేపీ లో వుంటూ కూడా శత్రుఘ్న సిన్హా లాంటి వాళ్ళు నితీష్ జపం చేశారు. అయితే ఎప్పుడైతే నితీష్, లాలూని వదిలి బీజేపీ చెంతకు చేరాడో భావి ప్రధాని అన్న టాగ్ నితీష్ కు తొలగిపోయింది. రాహుల్ కాకుండా ఇంకో ప్రత్యామ్న్యాయం ఏది అని చూసినప్పుడు అందరి దృష్టి ఇప్పుడు చంద్రబాబు మీదే పడుతోంది.
బీజేపీ తో టీడీపీ పొత్తు ఉన్నప్పటికీ చంద్రబాబును మోడీ చూస్తున్న తీరు ఎంత అవమానకరంగా వుందో అందరికీ అర్ధం అవుతూనే వుంది. ఉమ్మడిగా ఆంధ్రప్రజలకు ఇచ్చిన హామీలను మోడీ పూర్తిగా తుంగలో తొక్కినా ఒక్క అడుగు కూడా వెనకడుగు వేయకుండా చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధికి చేస్తున్న పోరాటం ఎందరినో ఆకట్టుకుంటోంది. ఆ క్రమంలో ఒక్కసారి కూడా చంద్రబాబు సహనం, సంయమనం కోల్పోకుండా వ్యవహరించడం చూస్తున్న వారికి ఆయనలోని నాయకత్వ లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇక బీజేపీ ఎంత పాకులాడినా ఏపీ లో ఆ పార్టీ కి స్థానం లేకుండా చేయడంలో ఆయన వ్యూహ చతురత కనిపిస్తోంది. ఇవన్నీ చూసిన వివిధ ప్రాంతీయ పార్టీలు ఇప్పుడు నితీష్ స్థానంలో భావి ప్రధానిగా చంద్రబాబును వూహించుకుంటున్నాయి. అందుకేనేమో మోడీ అంటే మండిపడిపోయే మమతా, కేజ్రీవాల్ వంటి నేతలతో సమావేశం అయిన కమల్ కూడా తాను చంద్రబాబు ను అభిమానిస్తానని చెప్పారు. బీజేపీ మీదకు ఒంటి కాలుతో లేస్తున్న కమల్ మాటలు 2019 ఎన్నికల తర్వాత రాజకీయ పరిణామాలకు అద్దం పట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు.