Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పోలవరంపై మాటల యుద్ధం కొనసాగుతోంది. కేంద్రం ఇన్నాళ్లూ ఏం చేసినా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మౌనంగా ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం విషయంలో మాత్రం చూస్తూ ఊరుకోలేకపోయారు. విభజన హామీల విషయంలో కేంద్రప్రభుత్వం నుంచి ఏపీకి తీవ్ర అన్యాయం జరిగింది. ప్రత్యేక హోదా మొదలుకుని విభజన చట్టంలోని అనేక హామీలను మోడీ సర్కార్ బుట్టదాఖలా చేసింది. కేంద్రం తీరుపై చాన్నాళ్ల క్రితమే తెలుగు తమ్ముళ్లు బాహాటంగా వ్యతిరేకత ప్రదర్శించినప్పటికీ చంద్రబాబు నాయుడు వారిని వారించారు. ఎక్కడా సంయమనం కోల్పోకుండా వ్యవహరించారు. తనతో పాటు పార్టీ, ప్రభుత్వ నేతలెవరూ బీజేపీ ప్రభుత్వాన్ని తప్పు పట్టకుండా జాగ్రత్తగా మసలుకున్నారు. ఈ వైఖరే కేంద్రానికి అలుసుగా మారిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేంద్రం ఏం చేస్తున్నా.. రాష్ట్ర ప్రయోజనాల కోసం కిమ్మనకుండా ఉన్న చంద్రబాబును మరింతగా ఇరుకున పెట్టేందుకు పోలవరం అంశాన్ని బీజేపీ సర్కార్ వాడుకుంది. అయితే విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఏపీకి పోలవరాన్ని వరప్రదాయనిగా చంద్రబాబు భావిస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని, అడ్డుంకులన్నింటినీ దాటుకుంటూ… అనుకున్న సమయం కల్లా పోలవరం పూర్తిచేయాలన్న ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నారు. కానీ బీజేపీ ఈ అంశాన్ని కూడా రాజకీయం చేయడంతో ఇక చూస్తూ ఊరుకోలేకపోయారు చంద్రబాబు.
పోలవరంపై అసెంబ్లీలో చంద్రబాబు చేసిన ప్రకటన తీవ్ర కలకలం రేపింది. ఎప్పటినుంచో కేంద్రం వైఖరిపై ఆగ్రహంగానే ఉన్న చంద్రబాబు… అదనుచూసుకుని ఒక్కసారిగా విమర్శలు కురిపించారు. సాధారణంగా ఇలాంటి పరిస్థితులు ఎదురయినప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలు వంటి నేతలతో మొదట విమర్శలు చేయించి… కేంద్రం స్పందనను బట్టి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు విమర్శలు మొదలుపెడతారు. కానీ ఈ ముసుగులో గుద్దులాటను ఎక్కవరోజులు కొనసాగించాలని చంద్రబాబు భావించలేదు. ఏది జరిగినా తాడో పేడో తేల్చుకోవాలని నిర్ణయించుకున్నారు. స్వయంగా ముఖ్యమంత్రే కేంద్రంపై విమర్శలు ఎక్కుపెట్టడంతో టీడీపీ నేతలూ వెనక్కి తగ్గడం లేదు. చంద్రబాబును నియంత్రించాలనే దుర్బుద్దితో కేంద్రం వ్యవహరిస్తోందని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఆరోపించారు. పోలవరం కోసం చంద్రబాబు తన స్థాయి తగ్గించుకుని మరీ కేంద్రం చుట్టూ తిరుగుతోంటే.. కేంద్రం మాత్రం ఆయన్ను నియంత్రించాలని చూస్తోందని మండిపడ్డారు. బీజేపీ ఆకలితో ఉందని, ఒక్కో రాష్ట్రాన్ని ఆక్రమించుకోవాలని చూస్తోందని, అందుకనే పోలవరం విషయంలో లేనిపోని సమస్యలు సృష్టిస్తోందని ఆరోపించారు. ఏమైనా అనుమానాలుంటే అడిగి తెలుసుకోవాలి కానీ.. పిలిచిన టెండర్లను ఆపాలనడం సరైనది కాదన్నారు.
ఏపీని కేంద్రం చిన్నచూపు చూస్తోందని, ఇది వాళ్ల జాగీరు కాదని, తాము వారికి బానిసలం కాదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పోలవరాన్ని ఆపాలని చూస్తే దేశంలో అతిపెద్ద తిరుగుబాటు వచ్చే అవకాశముందని హెచ్చరించారు. ఏపీతో వైరం పెట్టుకుంటే కేంద్రానికే నష్టమన్నారు. అటు బీజేపీ రాష్ట్ర నేతలు కూడా ఈ విషయంపై ఇష్టారీతిన మాట్లాడుతున్నారు. పోలవరంపై అడ్డగోలుగా వ్యవహరిస్తూ కొత్త కాంట్రాక్టర్లను పిలిస్తే..అధికారులంతా జైలుకు వెళ్లాల్సివస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత రఘునాథబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎట్టిపరిస్థితుల్లోనూ పోలవరం గుత్తేదారులను మార్చేందుకు అంగీకరించేది లేదని తేల్చిచెప్పారు. టీడీపీపైనా తీవ్ర విమర్శలు చేశారు. ప్రాజెక్టు పూర్తిచేయాలని కేంద్రం సంకల్పంతో ఉన్నా… కావాలనే అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. మరో నేత సోము వీర్రాజు కూడా ఈ తరహా వ్యాఖ్యలే చేశారు.
పోలవరం ప్రాజెక్టును నిబద్ధతో పూర్తిచేస్తారన్న నమ్మకంతో ప్రాజెక్టును చంద్రబాబు చేతుల్లో పెడితే.. నిర్మాణాన్ని పక్కదారి పట్టించి కేంద్రంపై విమర్శలు చేయడం ఎంతవరకూ సమంజసమని ఆయన ప్రశ్నించారు. గుత్తేదారులను మార్చాలన్న ఆలోచన వెనక దురుద్దేశాలు ఉన్నాయని ఆరోపించారు. పోలవరంపై సాగుతున్న ఈ మాటల యుద్ధం కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల మద్య సంబంధాలను తీవ్రంగా దెబ్బతీస్తుందని పలువురు భావిస్తున్నారు. అలాగే కేంద్రంపై ఆగ్రహంతో పోలవరాన్ని నిర్మించే బాధ్యతను చంద్రబాబు మోడీ సర్కారుకు అప్పగిస్తే.. ఏపీ తీవ్రంగా నష్టపోతుందనే అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. కేంద్రం రంగంలోకి దిగితే… ప్రత్యేక హోదా వంటి అత్యంత కీలకమైన హామీలకు పట్టినగతే.. పోలవరానికి పడుతుందని ఏపీ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినప్పటికీ… పోలవరాన్ని రాష్ట్రప్రభుత్వమే నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు.