Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రాష్ట్ర హక్కులపై రాజీపడే ప్రసక్తే లేదని, ప్రజల మనోభావాల ప్రకారం పోరాటం ఉధృతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీ ఎంపీలను ఆదేశించారు. సభ నుంచి సస్పెండ్ చేసినా, వెనక్కి తగ్గకుండా పోరాటం కొనసాగించాలని దిశానిర్దేశం చేశారు. ఇది చాలా కీలకసమయమని, ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. విభజన చట్టం పూర్తిగా అమలుచేయాలని, పార్లమెంట్ లో ఇచ్చిన హామీలను కేంద్రం నెరవేర్చాలని కోరారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని ఉభయసభల్లో వివరించాలని, కేంద్రమంత్రి పదవులకు ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందో అందరికీ తెలియజేయాలని అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరికి చంద్రబాబు సూచించారు. నిధుల మంజూరుకు సులభమార్గాలుంటే క్లిష్టమార్గాలు ఎందుకు ఎంచుకుంటున్నారని కేంద్రాన్ని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా సాధనే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని స్పష్టంచేశారు.
పార్లమెంట్ స్తంభింపచేస్తున్నామని, కేంద్రం నుంచి వైదొలిగామని, ఇంక దశలవారీగా పోరాటం ఉధృతంచేస్తామని చంద్రబాబు తెలిపారు. ప్రతిపక్ష వైసీపీ ద్వంద్వ వైఖరిపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్రంలో బీజేపీకి స్పష్టమైన మెజార్టీ ఉన్న విషయం తెలిసినప్పటికీ… అవిశ్వాసం ఎందుకు పెడుతున్నారో జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోడీపై విశ్వాసం ఉందని, జాతీయ చానల్ తో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించిన చంద్రబాబు… అంత విశ్వాసం ఉంటే అవిశ్వాసం ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు. వైసీపీ డొంకతిరుగుడు వ్యవహారాన్ని ప్రజలముందు బయటపెట్టి… వాళ్ల ముసుగు తొలగించాలని టీడీపీనేతలకు సూచించారు