న‌వ్యాంధ్ర పున‌ర్ నిర్మాణం గురించి తెలుసంటున్న టోనీ బ్లెయిర్

Chandrababu describe AP development details to Tony Blair

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో… రాజ‌ధాని హైద‌రాబాద్ ను ఆయ‌న అభివృద్ధి చేసిన విధానం, రాష్ట్రంలో అమ‌లుచేసిన సంస్క‌ర‌ణ‌లు ప్ర‌పంచం దృష్టిని ఆక‌ర్షించాయి. అంత‌ర్జాతీయ స్థాయిలో ఆయ‌న‌కు గుర్తింపు వ‌చ్చింది. ప్ర‌పంచ నేత‌లు అప్ప‌ట్లో హైద‌రాబాద్ ను సంద‌ర్శించేవారు. వారిలో ముఖ్యంగా అప్ప‌టి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింట‌న్, బ్రిటన్ ప్ర‌ధాని టోనీ బ్లెయిర్ అయితే… చంద్రబాబుకు మిత్రులుగా కూడా మారారు. భార‌త్ ప‌ర్య‌ట‌న‌లో వారు ప్ర‌త్యేక శ్ర‌ద్ధ‌తో ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ప‌ర్య‌టించారు. ఇదంతా గ‌డిచి 20 ఏళ్లు కావొస్తోంది. ఈ 20 ఏళ్ల‌లో స్థానికంగానూ, అంతర్జాతీయంగానూ ఎన్నో మార్పులొచ్చాయి. అప్ప‌టి నేత‌లు ప‌ద‌వీకాలం ముగించుకుని రిటైర్మెంట్ జీవితం గ‌డుపుతున్నారు. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ విడిపోయి… న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ ఏర్ప‌డి… చంద్ర‌బాబు కొత్త రాష్ట్రానికి సీఎం అయ్యారు. అయిన‌ప్ప‌టికీ అప్ప‌టి అంత‌ర్జాతీయ స్థాయి నేత‌లెవ‌రూ చంద్ర‌బాబును మ‌ర్చిపోలేదు. ముఖ్య‌మంత్రి సింగ‌పూర్ ప‌ర్య‌ట‌న‌లో ఆయ‌నకు ఎదురైన అనుభ‌వ‌మే ఇందుకు ఉదాహ‌ర‌ణ‌.

త‌న ప‌ర్య‌ట‌న‌లో భాగంగా చంద్ర‌బాబు బ్రిట‌న్ మాజీ ప్ర‌ధాని టోనీ బ్లెయిర్ తో స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఒక‌ప్ప‌టి తన హైద‌రాబాద్ సంద‌ర్శ‌న‌ను, చంద్ర‌బాబుతో క‌లిసి మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాలోని ఓ గ్రామాన్ని ప‌రిశీలించిన వైనాన్ని ఆయ‌న గుర్తుచేసుకున్నారు. కొత్త రాష్ట్రం ఎలా ఉంద‌ని అడిగి వివ‌రాలు తెలుసుకున్నారు. చంద్ర‌బాబు నాయ‌క‌త్వంలో కొత్త రాష్ట్రాన్నిపున‌ర్ నిర్మాణం చేస్తున్న తీరు త‌న‌కు తెలుసునని టోనీ బ్లెయిర్ చెప్పారు. కొత్త రాజ‌ధాని నిర్మాణానికి రైతులు ముందుకొచ్చి త‌మ‌కు స‌మీక‌ర‌ణ విధానంలో భూములు ఎలా అందించిందీ టోనీ బ్లెయిర్ కు చంద్ర‌బాబు వివ‌రించారు. పెట్టుబ‌డుల ఆక‌ర్ష‌ణ‌కు ఏపీ ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌లు, వ‌చ్చే 15,20 ఏళ్ల‌పాటు 15శాతం సుస్థిర వృద్ధి ల‌క్ష్యాన్ని పెట్టుకుని ప‌నిచేస్తున్న వైనం, ఫైబ‌ర్ క‌నెక్టివిటీ, ఆహార శుద్ధిరంగంలో ఏపీలో ఉన్న అపార అవ‌కాశాల‌ను వివ‌రించారు. ఏపీలో చేప‌డుతున్న ప్ర‌తి కార్య‌క్ర‌మం గురించి వివ‌రంగా తెలుసుకునేందుకు బ్లెయిర్ ఆస‌క్తి క‌న‌బ‌ర్చారు. ఎప్పుడైనా భార‌త‌దేశం వెళ్లిన‌ప్పుడు ఏపీకి త‌ప్ప‌కుండా సందర్శించాల‌ని ఆనాటి అమెరికా అధ్య‌క్షుడు క్లింటన్ త‌నకు చెప్పిన సంగ‌తిని ఈ సంద‌ర్భంగా బ్లెయిర్ గుర్తుచేసుకున్నారు.

1978 నుంచి 40 ఏళ్ల‌పాటు చంద్ర‌బాబు రాజ‌కీయాల్లో అత్యంత క్రియాశీల‌కంగా వ్య‌వ‌హ‌రించ‌డం ఎలా సాధ్య‌మైంద‌ని ఆశ్చ‌ర్యం వ్య‌క్తంచేశారు. నూత‌న రాష్ట్రాభివృద్ధికి ఎలాంటి విజ‌న్ తో ముందుకెళ్తున్నార‌ని చంద్ర‌బాబును అడిగి తెలుసుకున్నారు. ఏపీని సంద‌ర్శించాల‌ని చంద్ర‌బాబు బ్లెయిర్ ను ఆహ్వానించారు. చంద్ర‌బాబు ఆహ్వానానికి బ్లెయిర్ సానుకూలంగా స్పందించారు. ఏపీ సందర్శ‌న‌కు ఆస‌క్తి క‌న‌బర్చారు. భార‌త్ లో ఇప్ప‌టికే త‌మ సంస్థ 200 విద్యాసంస్థ‌ల‌తో క‌లిసి ప‌నిచేస్తోంద‌ని, ఏపీతోనూ క‌లిసి ప‌నిచేస్తుంద‌ని హామీఇచ్చారు. ముందుగా త‌మ బృందాన్ని పంపించిన త‌ర్వాత తాను వ‌స్తాన‌ని బ్లెయిర్ తెలిపారు. టోనీ బ్లెయిర్ ప్ర‌స్తుతం టోనీ బ్లెయిర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్లోబ‌ల్ ఛేంజ్ పేరుతో ఓ సంస్థ నిర్వ‌హిస్తున్నారు.