Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
హైదరాబాద్ భూకుంభకోణం లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి ని టీడీపీ నుంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. సీఎం చంద్రబాబు నివాసంలో జరిగిన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో దీపక్ రెడ్డి అంశంతో పాటు, అయ్యన్న, గంటాల మధ్య వివాదం గురించి కూడా చంద్రబాబు చర్చించారు. ఆర్ధిక అవకతవకల కేసుకి సంబంధించి నెల్లూరు జిల్లా నేత వాకాటి నారాయణ రెడ్డి మీద చర్య తీసుకుని, దీపక్ ని వదిలేయడం వల్ల పార్టీకి చెడ్డ పేరు వస్తోందని టీడీపీ సమన్వయ కమిటీ అభిప్రాయపడింది. జేసీ బ్రదర్స్ కి మేనల్లుడు అయినందువల్ల దీపక్ విషయంలో చూసీచూడనట్టు ఉన్నారన్న విమర్శల్ని తిప్పికొట్టేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని బాబు నిర్ణయించారు.
అటు విశాఖ భూకుంభకోణం మీద చంద్రబాబు సుదీర్ఘంగా చర్చించారు. మంత్రులిద్దరూ గొడవపడి ప్రతిపక్షానికి ఆయుధం చేతికిచ్చారని బాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారట. ఎన్నిసార్లు చెప్పినా గంటా, అయ్యన్న తీరు మారడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసి ఇకపై తప్పు చేస్తే ఎంతటివారైనా ఉపేక్షించబోనన్న సంకేతాలు పంపడానికి బాబు డిసైడ్ అయ్యారట. అదే సమయంలో కేవలం మంత్రుల్ని మందలించి విశాఖ భూకుంభకోణాన్ని అలాగే వదిలేయడానికి వీల్లేదని కూడా బాబు చెప్పారట. విశాఖ కుంభకోణాన్ని మూలాల నుంచి తోడటానికి మొత్తం 10, 15 ఏళ్లుగా సాగుతున్న అక్రమాల గుట్టు బయటికి వచ్చేలా తీవ్రమైన చర్య తీసుకోడానికి సిద్ధమని సంకేతాలు ఇచ్చారట. దీనిపై త్వరలో ఉన్నత స్థాయి విచారణకు అవకాశం వుంది.