మోడీ వైఖ‌రిని జాతీయ‌స్థాయిలో ఎండ‌గ‌ట్టిన చంద్ర‌బాబు

Chandrababu Fires on Modi in front of National Media

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

విభ‌జ‌న బాధిత ఏపీ విష‌యంలో ప్ర‌దాన‌మంత్రి మోడీ నిర్ల‌క్ష్య వైఖ‌రిని ముఖ్య‌మంత్రి జాతీయ మీడియా ముందు ఎండ‌గ‌ట్టారు. ప్ర‌త్యేక హోదా, విభ‌జ‌న హామీల అమ‌లు కోసం రెండురోజుల‌పాటు ఢిల్లీలో ప‌ర్య‌టించిన ముఖ్య‌మంత్రి బుధ‌వారం సాయంత్రం జాతీయ‌మీడియాతో మాట్లాడారు. విభ‌జ‌న వ‌ల్ల ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు జ‌రిగిన న‌ష్టం, ఎన్నిక‌ల స‌మ‌యంలో మోడీ ఇచ్చిన హామీలు, వాటిని నెర‌వేర్చ‌ని వైనం, పోల‌వ‌రం త‌దిత‌ర విష‌యాల‌ను కూలంక‌షంగా వివ‌రించారు. విభ‌జ‌న వ‌ల్ల ఏపీకి జ‌రిగిన న‌ష్టాన్ని ప‌వ‌ర్ పాయింట్ ప్రెజెంటేష‌న్ ద్వారా తెలియ‌జేశారు. విభ‌జ‌న‌తో క‌ష్టాల్లో ఉన్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు కేంద్ర ప్ర‌భుత్వం ఏమీ చేయ‌లేద‌ని చంద్ర‌బాబు ఆవేద‌న వ్య‌క్తంచేశారు. విభ‌జ‌న శాస్త్రీయంగా జ‌ర‌గాల‌ని అప్ప‌ట్లో తాను కోరాన‌ని, విభ‌జ‌న వ‌ల్ల వ‌చ్చే స‌మ‌స్య‌ల‌పై శ్వేత‌ప‌త్రం కూడా విడుద‌ల చేశామ‌ని గుర్తుచేశారు. ఏపీకి బీజేపీ న్యాయం చేస్తుంద‌నే ఎన్డీఏలో చేరామ‌ని తెలిపారు.

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఏపీకి ఇచ్చిన హామీల‌ను ప్ర‌ధాని ఇప్ప‌టికీ నెర‌వేర్చ‌లేద‌ని మండిప‌డ్డారు. విభ‌జ‌న వ‌ల్ల న‌ష్ట‌పోయిన రాష్ట్రానికి సాయం చేయాల‌ని తాము కేంద్ర‌ప్ర‌భుత్వాన్ని కోరుతూ వ‌చ్చామ‌ని, 29 సార్లు ఢిల్లీకి వ‌చ్చాన‌ని తెలిపారు. విభ‌జ‌న జ‌రిగి నాలుగేళ్ల‌యినా సాయం చేయ‌లేద‌ని, విభ‌జ‌న వ‌ల్ల చాలా న‌ష్ట‌పోయామ‌ని చెబుతున్నా… కేంద్రం వినిపించుకోలేద‌ని, ఏపీకి సాయం చేస్తున్నామంటూ, త్వ‌ర‌లోనే మ‌రింత సాయం అందిస్తామంటూ కేంద్రం నాన్చుడు ధోర‌ణితో వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని మండిపడ్డారు. కేంద్ర‌ప్రభుత్వం ప్ర‌వేశ‌పెట్టిన ఐదో బ‌డ్జెట్ వ‌ర‌కు తాము ఎదురుచూశామ‌ని, చివ‌రిబ‌డ్జెట్ లోనూ కేంద్రం రాష్ట్రానికి ఏమీ చేయ‌లేద‌ని, క‌నీస సాయం చేయ‌కుండా ఏపీపై ఎదురుదాడికి దిగుతున్నార‌ని చంద్ర‌బాబు ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు. ఈ సంద‌ర్భంగా ఏపీకి మోడీ ఇచ్చిన హామీల‌కు సంబంధించిన వీడియోల‌ను ప్ర‌ద‌ర్శించి చూపారు.

ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని చెప్పిన ప్ర‌క‌ట‌న వీడియోను, అమ‌రావ‌తి శంకుస్థాప‌న స‌భ‌లో మాట్లాడుతూ… విభ‌జ‌న చ‌ట్టంలోని అన్ని హామీల‌ను నెర‌వేరుస్తామ‌ని, అమ‌రావ‌తి నిర్మాణానికి స‌హ‌క‌రిస్తామ‌ని చెప్పిన వీడియో దృశ్యాల‌ను మీడియాకు చూపించారు. మొద‌ట ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని చెప్పి, ఆ త‌ర్వాత హోదాకు బ‌దులు ప్యాకేజీ ఇస్తామంటే అంగీక‌రించామ‌ని, రెండున్న‌రేళ్లుగా ప్ర‌త్యేక ప్యాకేజీ కోసం ఎదురుచూశామ‌ని, మ‌ళ్లీ ఇప్పుడు స్పెష‌ల్ ప‌ర్ప‌స్ వెహిక‌ల్ అంటోంద‌ని విమర్శించారు. కేంద్ర ప్ర‌భుత్వ తీరుతో 5కోట్ల మంది ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతున్నార‌ని చెప్పారు. పోల‌వ‌రం ప్రాజెక్టును రాష్ట్ర ప్ర‌భుత్వ‌మే పూర్తిచేస్తుంద‌ని నీతి అయోగ్, కేంద్ర‌ప్ర‌భుత్వం చెప్పాయ‌ని, ఏపీకి ఎంతో ప్ర‌ధాన‌మైన పోల‌వ‌రం పనులు పూర్తిస్థాయిలో వేగ‌వంతంగా జ‌రుగుతున్నాయ‌ని, ఇలాంటి ప‌రిస్థితుల్లో ప్రాజెక్టుకు నిధులు స‌రిగ్గా ఇవ్వ‌కుండా ఇబ్బందులు పెడుతున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు.

పోల‌వరంపై తాము ఖ‌ర్చుపెట్టిన రూ. 3వేల కోట్లు కేంద్రం తిరిగి ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. పోల‌వ‌రంలో జ‌రుగుతున్న ప‌నుల‌ను లైవ్ ద్వారా చూపించారు. చేయాల్సిన స‌హాయాన్ని చేయ‌కుండా విమర్శ‌లు చేస్తున్నార‌ని, నిధుల‌కు సంబంధించిన యూసీలు స‌మ‌ర్పించిన‌ప్ప‌టికీ ఇవ్వ‌లేద‌ని అంటున్నార‌ని విమ‌ర్శించారు. ఇచ్చిన హామీలు నెర‌వేర్చ‌కుండా ఏపీ ప్ర‌భుత్వంపై బుర‌ద‌జ‌ల్లే కార్య‌క్ర‌మం చేప‌ట్టార‌ని మండిప‌డ్డారు. 40 ఏళ్ల రాజ‌కీయ అనుభ‌వం ఉన్న త‌న ప‌ర‌ప‌తిని డ్యామేజ్ చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని చంద్ర‌బాబు ఆరోపించారు.