ఎన్డీయే నుండి టీడీపీ విడిపోయిన నాటి నుండి కేంద్రం అన్ని విషయాల్లో ఆంద్రప్రదేశ్ రాష్ట్రము మీద వివక్ష చూపడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి మాట మార్చిన బీజేపీ ప్రభుత్వం ఆ తర్వాత ఏపీకి అడుగడుగునా అడ్డు కట్టలు వేస్తూ వస్తోంది. ఇటీవలే బాబు విదేశీ పర్యటనకు ఆంక్షలు విధించి ఆంద్ర ప్రజల ఆగ్రహానికి గురైన కేంద్రం నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అంటూ ఏపీకి మరో ఝలక్ ఇచ్చింది. దేశ రాజధాని ఢిల్లీలో జరగబోయే రిపబ్లిక్ డే వేడుకల్లో ఏపీ శకటానికి కేంద్రం అనుమతి ఇవ్వలేదు. స్వాతంత్ర్య ఉద్యమం, మహాత్మా గాంధీ జీవితం ఇతివృత్తాలతో కూడిన శకటం తయారు చేయాలంటూ గత ఆగస్ట్ లో ఎపీకి కేంద్రం సూచించింది.
దీంతో విజయవాడ గాంధీకొండ, స్థూపం, పొందూరు ఖద్దరు, ఏపీలో స్వాతంత్ర్య ఉద్యమ ఇతివృత్తంతో ఏపీ ప్రభుత్వం శకటం సిద్ధం చేయగా అది బాగుందంటూ కితాబిచ్చిన కేంద్రం. ఇప్పుడు అదే శకటాన్ని నిరాకరిస్తూ ఇలా నిర్ణయం తీసుకోవటం అందరినీ ఆశ్చర్యపరిచింది. అనూహ్యంగా ఇలా యూటర్న్ తీసుకున్న కేంద్రం శకటం నచ్చలేదని చెప్పడం కలకలం రేపుతోంది. చివరి నిమిషంలో ఏపీ శకటానికి కేంద్ర రక్షణశాఖ అనుమతి నిరాకరించడంతో ఏపీ రాజకీయ వర్గాలు కేంద్రంపై విరుచుకు పడుతున్నాయి. ఆంద్రప్రదేశ్ రాష్ట్రంపై కేంద్రం వివక్ష చూపుతోందంటూ మండిపడుతున్నాయి. మరోవైపు తాజాగా జరిగిన ఈ వ్యవహారంపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిరసన తెలుపుతూ వెంటనే లేఖ రాయాలని అధికారులకు చంద్రబాబు ఆదేశించారు.