Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నాలుగేళ్లగా టీడీపీతో కలిసి నడిచి ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్న జనసేనానిపై టీడీపీ నేతల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రత్యర్థులపై ఆచితూచి విమర్శలు చేసే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి కూడా పవన్ వ్యవహారం తీవ్ర చిరాకు కలిగిస్తోంది. తనపై ప్రతిపక్ష వైసీపీ, ఇతర పార్టీల నేతలు చేసే విమర్శలను చూసీచూడనట్టు వదిలేసే చంద్రబాబు పవన్ కళ్యాణ్ మిత్రద్రోహానికి పాల్పడి చేసిన వ్యాఖ్యలను మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. తన వైఖరికి భిన్నంగా పవన్ వ్యాఖ్యలపై బహిరంగంగానే మండిపడుతున్నారు. పవన్ ఏర్పాటు చేసిన నిజనిర్ధారణ కమిటీపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీనే ఒక వేస్ట్ కమిటీ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు గురించి కేంద్రాన్ని నిలదీయకుండా… మధ్యవర్తులుగా ఉండడానికి మీరెవరు అని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రధాని మోడీతో మాట్లాడకుండా తన గురించి ఫ్యాక్ట్ ఫైండిగ్ కమిటీ ఎలా వేస్తారని ప్రశ్నించారు.
రాష్ట్రంలో అలజడులు సృష్టించి, కేంద్రానికి మేలు చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఇసుక విక్రయాలకు సంబంధించి ఒకటి, రెండు చిన్న చిన్న పొరపాట్లు జరిగితే… మైనింగ్ స్కామ్ అంటూ గాలి జనార్ధన్ రెడ్డితో ముడిపెట్టారని, ఇది సరికాదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఎర్రచందనంపై తాను ఉక్కుపాదం మోపానని, దీనికి సంబంధించి తమిళనాడులో తన పట్ల వ్యతిరేకత కూడా వ్యక్తమయిందని, అప్పటి ముఖ్యమంత్రి జయలలిత తనకు లేఖ కూడా రాశారని గుర్తుచేశారు. ఇలాంటి వాస్తవాలను పవన్ తెలుసుకోవాలని సూచించారు. తన కుమారుడు, మంత్రి లోకేశ్ పై పవన్ చేసిన అవినీతి ఆరోపణలపై కూడా చంద్రబాబు స్పందించారు. లోకేశ్ పై చేసిన ఆరోపణలను పవన్ నిరూపించగలరా అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. డబ్బే కావాలనుకుంటే లోకేశ్ హెరిటేజ్ చూసుకుంటే సరిపోతుందని, వ్యాపారాలతో ఏడాదికి రూ. 65 కోట్లు మిగిలేదని, ప్రజాసేవ కోసమే లోకేశ్ వ్యాపారాలను వదిలి రాజకీయాల్లోకి వచ్చారని సీఎం తెలిపారు. లోకేశ్ తన కన్నా ఎక్కువ కష్టపడుతున్నారని, చిన్నప్పుడు తాను లోకేశ్ ను అర్ధరాత్రి తర్వాతే చూసేవాడినని, ఇప్పుడు దేవాన్ష్ ను వారానికి ఒక్కరోజు మాత్రమే చూసుకునే పరిస్థితి లోకేశ్ ది అని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రప్రయోజనాలే తనకు లక్ష్యమని చంద్రబాబు మరోసారి స్పష్టంచేశారు.
ప్రాంతీయ పార్టీలు ఉండకూడదనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. విభజన హామీలు నెరవేర్చని కేంద్రంపై అవిశ్వాసం ఎన్డీయేలో ఉండి పెట్టడం అనైతికత కాబట్టే, కూటమి నుంచి బయటకు వచ్చామని వెల్లడించారు. ప్రత్యేక హోదా, విభజన హామీల కోసం రెండు నెలల నుంచి వైసీపీ అవిశ్వాసం గురించి మాట్లాడుతోందని, కానీ ఆ పార్టీకి మద్దతిచ్చేందుకు జాతీయస్థాయిలో ఎవరూ ముందుకురాలేదని, పీఎంవో చుట్టూ చక్కర్లు కొట్టే అవిశ్వాసాన్ని ఎవరూ నమ్మలేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. తాను ఏ పార్టీలతో మాట్లాడకపోయినప్పటికీ… టీడీపీ అవిశ్వాసం పెట్టగానే మద్దతిచ్చేందుకు అనేక పార్టీలు ముందుకొచ్చాయని, జాతీయ పార్టీలకు టీడీపీ పట్ల ఉన్న విశ్వసనీయత అదని చంద్రబాబు తెలిపారు.