Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
దాదాపు పదేళ్లు ప్రతిపక్ష పాత్ర పోషించి రాష్ట్ర విభజన తరువాత తిరిగి టీడీపీ ని ఏపీ లో అధికార పీఠాన్ని ఎక్కించడానికి చంద్రబాబు పడ్డ కష్టాలు అన్నీఇన్నీ కావు. ఆ క్రమంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు కూడా ఎంతో శ్రమించారు. పార్టీ అధికారంలోకి వచ్చాక వీరిలో చాలా మందికి తగ్గ పదవులు ఇచ్చి గౌరవించారు చంద్రబాబు. అలా పెద్దగా కష్టపడకుండా పదవి దక్కించుకున్న కొందరిలో పరకాల ప్రభాకర్ ఒక్కరు. పార్టీతో పెద్దగా సంబంధం లేకుండా సీఎం కి సమాచార సలహాదారుగా ఏకంగా క్యాబినెట్ ర్యాంక్ పొందారు. సుదీర్ఘ కాలం బీజేపీ లో కొనసాగడం, ఆపై ప్రజారాజ్యం లో కీలక పాత్ర పోషించడం కన్నా కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ భర్త కాబట్టే ఆయనకు ఆ పదవి ఇచ్చారని టీడీపీ శ్రేణులే బహిరంగంగా ఒప్పుకున్నాయి. పరకాల సతీమణి కేంద్రమంత్రిగా ఉన్నందున ఆయన క్యాబినెట్ ర్యాంకులో ఉంటే రాష్ట్రానికి ఏదో ఒక మేలు జరుగుతుందన్న అంచనాలు తప్పాయి. ఏ కారణం వల్ల అయితేనేమి ఆంధ్రప్రదేశ్ కి పరకాల లేదా నిర్మలా సీతారామన్ వల్ల కలిగిన అదనపు ప్రయోజనం ఏమీ లేదు.
ఇక సీఎం తో పాటు ప్రతి విదేశీ పర్యటనకు వెళుతున్న సమాచార సలహాదారు పరకాల ప్రభాకర్ తనకు అప్పగించిన పనుల్లో అద్భుతాలు ఏమీ చేయడం లేదు. పైగా మొత్తం ఒక వర్గం వారినే పెంచి పోషిస్తున్నారని విమర్శలు వున్నాయి. పుష్కరాలు సహా వివిధ సందర్భాల్లో ప్రభుత్వ ప్రచారానికి సంబంధించిన పనుల్లో పరకాల మీద కొన్ని ఆరోపణలు కూడా వచ్చాయి. ఇలా ఎన్ని తప్పులు భరించినా పరకాలతో ప్రయోజనం లేదని తేలిపోయింది. మరీ ముఖ్యంగా టీడీపీ తో బీజేపీ బంధం తెగిపోడానికి సిద్ధంగా వుంది. అలాంటి సందర్భంలో పరకాలకు ఇంకా పెద్ద పీట వేయడంలో అర్ధం లేదు. ఇంకా భరించి పెద్ద పీట వేసినా ఇలాంటి వాళ్ళు పదవి పోయిన రెండో రోజు పార్టీకి కీడు చేస్తారు తప్ప మేలు చేయరని చ్రప్పడానికి ఇటు ఐవైఆర్ ఎపిసోడ్ , అటు ప్రజారాజ్యం ఎపిసోడ్ పెద్ద ఉదాహరణ. ఈ విషయాలు గమనించి పరకాలకు ఇంకా పెద్ద పీట వేయడం అవసరమో, కాదో చంద్రబాబు ఆలోచించుకోవాలి.