Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకరికొకరు సహకరించుకుని తెలుగు ప్రజల అభ్యున్యతి కోసం కృషిచేయాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కోరారు. ఉపష్ట్రపతిగా ఎన్నికయిన తరువాత తొలిసారి ఆంధ్రప్రదేశ్ కు వచ్చిన వెంకయ్యనాయుడు ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో అనేక అంశాలపై మాట్లాడారు. తెలుగు ప్రజలు, తెలుగు ముఖ్యమంత్రులు సామరస్య ధోరణితో ముందుకుపోవాలని సూచించారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం జరిగిందని ఆయన అంగీకరించారు. అందుకే విభజన సమయంలో తాను ఎంతో మధనపడ్డానని, రాజ్యసభలో ఏపీ కోసం గళమెత్తానని చెప్పారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేందుకు తన వంతు కృషిచేస్తున్నానని తెలిపారు.
కేంద్ర మంత్రిగా ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర విద్యాసంస్థలు, పరిశ్రమలు రావటానికి కృషిచేశానని, చాలా మంది తనను ఏపీకి మంత్రా అని ఎద్దేవా చేశారని గుర్తుచేశారు. ఉపరాష్ట్రపతిగా ఉన్నా… తెలుగు రాష్ట్రాలకూ, తెలుగు ప్రజలకూ సాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఉపరాష్ట్రపతిగా ఎన్నిక కావటం ఆనందంగా ఉందని రాజ్యసభ చైర్మన్‌గా పెద్దల సభకు పూర్వ వైభవం తీసుకొస్తానని చెప్పారు.
సన్మాన కార్యక్రమంలో వెంకయ్య నాయుడిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రశంసల వర్షం కురిపించారు. విభజన సందర్భంలో ఏపీ తరపున నిలబడిన ఏకైక వ్యక్తి వెంకయ్యనాయుడు అని చంద్రబాబు కొనియాడారు. కేంద్రమంత్రిగా కూడా రాష్ట్రానికి ఎన్నో రకాలుగా సేవ చేశారని, ఆయన నేతృత్వంలోనే రాష్ట్రానికి మూడు స్మార్ట్ సిటీలు వచ్చాయని చెప్పారు. వెంకయ్యనాయుడు ఏ పదవిలో ఉన్నా… ఆ పదవికే వన్నె తెచ్చారని, తెలుగుజాతి గర్వించదగ్గ వ్యక్తి అని ప్రశంసించారు.
రాష్ట్ర విభజన సమయంలో వెంకయ్య చాలా కృషిచేశారని, ఆయన ఎంతో క్రమశిక్షణ కలిగిన వ్యక్తి అని గవర్నర్ నరసింహఃన్ అన్నారు. వెంకయ్యనాయుడు మంచి హాస్య చతురత ఉన్న వ్యక్తి అని ప్రశంసించారు. అంతకుముందు గన్నవరం విమానాశ్రయంలో వెంకయ్యనాయుడికి ముఖ్యమంత్రి, గవర్నర్ ఘనస్వాగతం పలికారు. అనంతరం గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు 23 కిలోమీటర్ల మేర లక్షల మంది విద్యార్థులతో వెంకయ్యనాయుడుకు ఏపీ ప్రభుత్వం అపూర్వ స్వాగతం ఏర్పాటుచేసింది. అయితే ఈ రోడ్ షోలో చిన్న అపశృతి చోటు చేసుకుంది. విమానాశ్రయం నుంచి ఓపెన్ టాప్ జీపులో వెంకయ్యనాయుడు, చంద్రబాబు, నరసింహన్ కలిసి ప్రజలకు అభివాదం చేస్తూ వస్తుండగా… వారి వాహనానికి సమీపంలో డ్రోన్ కుప్పకూలింది. దీంతో భద్రతా అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రమాదమేమీ లేకపోవటంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు మరో డ్రోన్ కెమెరా తెప్పించి ర్యాలీని చిత్రీకరించారు.
మరిన్ని వార్తలు:






