Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అసంఘటిత రంగ కార్మికులకు ఉద్దేశించిన చంద్రన్న బీమా ప్యాకేజిని ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకులకూ వర్తింపజేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది… ఎన్నో ఏళ్లుగా దేవాలయాల్లో వేలాది మంది అర్చకులు పనిచేస్తున్నా వారి సంక్షేమ అంశాలకు సంబంధించి అనేక అంశాలు కొలిక్కి రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో అర్చక కుటుంబాలకు చంద్రన్న బీమా వర్తింపజేసేందుకు ప్రాథమిక కసరత్తు సాగుతోంది. అక్టోబరు 2 నుంచి చంద్రన్న బీమా రెండో ఏడాది కింద కొత్త విధివిధానాలతో అమల్లోకి రానున్న నేపథ్యంలో అర్చకులను ఇందులో చేర్చే విషయమై ఆలోపు అవసరమైన చర్యలు చేపట్టి, తమను చంద్రన్న బీమా పరిధికి తేవాలన్న అర్చకుల కోరికను నెరవేర్చనుంది ప్రభుత్వం. అసంఘటిత రంగంలోని 2.13 కోట్ల మంది కార్మికులకు ఇప్పటికే ఈ బీమా వర్తింపజేస్తున్నారు. ఈ ఏడాది ఈ సంఖ్య 2.20 కోట్లను దాటబోతోంది.
చంద్రన్న బీమాలో సహజ మరణానికి రూ.2లక్షల బీమా అందించబోతున్నారు. వచ్చే అక్టోబరు నుంచి కొత్త రూపంతో ఈ బీమా పథకం అమల్లోకి రాబోతోంది. ప్రమాద మరణానికి రూ.5లక్షల వరకు బీమా సౌకర్యం కల్పిస్తున్నారు. పూర్తి వైకల్యం పొందితే రూ.5లక్షల సాయం అందిస్తారు. ఏ సంస్థలో పనిచేస్తున్నా నెలకు రూ.15వేల లోపు వేతనం పొందుతున్న ఎవరైనా చంద్రన్న బీమాకు అర్హులే.
చంద్రన్న బీమా నమోదుకు సంబంధించి ప్రభుత్వం బుధవారం మార్గదర్శకాలు విడుదల చేసింది. గతంలో చంద్రన్నబీమాగా ఉన్న ఈ పథకానికి ఆమ్ అద్మీ బీమా యోజన, ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన పథకాలను మిళితం చేసి అక్టోబరు 2 నుంచి అమలు చేస్తారు.